
చోరీలు జరగకుండా ముందస్తు చర్యలు
భూపాలపల్లి: బతుకమ్మ, దసరా పండుగ సెలవుల నేపథ్యంలో జిల్లాలో చోరీలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండుగల సందర్భంగా వేలాది మంది సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉందని, ఈ సమయాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసు గస్తీని మరింత పెంచుతామన్నారు. ఊర్లకు వెళ్తున్న వారు కూడా తమవంతుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీసులతో పాటు క్రైం విభాగం ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలు, షాపింగ్ మాళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే వారు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. బీరువా తాళాలు ఇంట్లో వదిలి వెళ్లవద్దని, ఇంట్లోని ఒక గదిలో లైట్ వేసి ఉంచాలన్నారు. ఎక్కువ రోజులు విహారయాత్రలకు వెళ్లే వారు పేపర్, పాల డెలివరీని ఆపేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా భూపాలపల్లి పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 58159కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.
ఎస్పీ కిరణ్ ఖరే