
ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు
భూపాలపల్లి: అనుమతులు లేకుండా ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పోలీసు, రెవెన్యూ, టీజీఎండీసీ, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు. కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేపట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు. అక్కడక్కడ పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఈ దందాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇవ్వాలని సూచించారు. రాజకీయ పలుకుబడులు, ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. యూరియా అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వ్యవసాయ అధికారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, మైనింగ్ ఏడీ జయరాజ్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలి..
ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌పై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో అదనపు సీఈఓ లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్, సిబ్బంది పాల్గొన్నారు.
విచారణ వేగిరం చేయాలి..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ భూముల విచారణ, భూ భారతి తదితర కీలక అంశాలపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు