
యూరియా కోసం రైతుల ఆందోళన
కాటారం: యూరియా దిగుమతి అయినా పంపిణీ చేయడం లేదని ఉదయం వచ్చి పడిగాపులు కాస్తున్నామని ఆరోపిస్తూ శుక్రవారం రైతులు పీఏసీఎస్ గోదాం ఎదుట కాటారం–మంథని రహదారిపై ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా దిగుమతి అయినప్పటికీ డీఓ రాలేదనే కారణంతో పీఏసీఎస్ అధికారులు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని వచ్చి ఎదురుచూస్తున్నా తమ బాధ ఎవరికీ పట్టడం లేదన్నారు. యూరియా పంపిణీ చేసేంత వరకు ఆందోళన విరమించుకునేది లేదని భీష్మించారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, నాయకులు మద్దతు తెలిపారు. కాటారం–మంథని రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్, ఏఈఓ రాజన్న ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేయించారు.