ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో ఓటర్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు గురువారానికి వాయిదా వేయగా, ఎలక్షన్ కమిషన్ మాత్రం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పనులు చక్క బెడుతోంది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి కలెక్టర్లతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుమిదిని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వీసీలో పాల్గొన్నారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని వీసీలో ఆమె ఆదేశించారు.
మొదటి విడతలో 70 ఎంపీటీసీలు, ఆరు జెడ్పీటీసీలు
జిల్లాలో మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి 6 మండలాల పరిధిలో 70 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ ఆర్‌ఓలు 15(అదనపు కలుపుకుని), ఎంపీటీసీ ఆర్‌ఓలు 55 ఆధ్వర్యంలో ఇతర సిబ్బందితో కలిసి నామినేషన్లను స్వీకరిస్తారు. దేవరుప్పుల 12 ఎంపీటీసీలు, పాలకుర్తి 17, కొడకండ్ల 9, లింగాలఘనపురం 11, చిల్పూర్ 12, స్టేషన్‌ఘన్‌పూర్ 9 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 417 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నారు.
2.12లక్షల మంది ఓటర్లు
ఆరు మండలాల పరిధిలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 2, 12, 117 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,04,974 పురుష ఓటర్లు, 1,07,139 మహిళా ఓటర్లు, ఇతరులు 4 ఉన్నారు.
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ, ఎలక్షన్లు
:సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జిల్లాలో మొదటి విడత ప్రారంభమయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులకు అనుగుణంగా నోటీసు ఇవ్వడంతో పాటు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ పత్రాలను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. ఇందులో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. తహసీల్దార్లు రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలకు సహకారం అందించాలన్నారు. కాగా ఎంపీడీవో కార్యాలయంలో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. రోజువారీగా వచ్చిన నామినేషన్ల సమాచారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంతో పాటు శిక్షణ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో(మునిసిపల్ మినహా) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఇతరులకు ప్రవేశం లేదని, పోలీస్ శాఖ బందోబస్తు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలపాటు పని చేస్తుందన్నారు. ఫిర్యాదుల కోసం–93908 30087ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, జడ్పీ డిప్యూ టీ సీఈఓ సరిత, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మండలం ఆర్‌ఓ
చిల్పూరు కె.అంబికాసోని
కొడకండ్ల ఎన్. లక్ష్మినర్సింహారావు
పాలకుర్తి కోదండరాములు
స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్.రాణాప్రతాప్
దేవరుప్పుల బి.శ్రీధర్‌రావు
ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, 12న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 13వ తేదీన అప్పీళ్ల స్వీకరణ, 14న చివరి అప్పీళ్ల పరిష్కరణ, 15న అభ్యర్థుల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్లు జాబితా వెలువరిస్తారు. 23వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మండలం ఎంపీటీసీలు పోలింగ్ పురుష మహిళ అదర్స్ మొత్తం
స్టేషన్లు (ఓటర్లు)
దేవరుప్పుల 12 68 18,610 18,723 – 37,333
పాలకుర్తి 17 106 26,189 26,675 1 52,865
కొడకండ్ల 09 61 14,202 14,468 2 28,672
లిం.ఘనపురం 11 64 16,323 17,033 – 33,356
చిల్పూరు 12 62 16,473 16,853 1 33,327
స్టే.ఘన్‌పూర్ 09 56 13,177 13,387 – 26,564
మొత్తం 70 417 1,04,974 1,07,139 4 2,12,117
జిల్లాలో ఆరు మండలాలు,
ఆరు జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీలు
ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు
కలెక్టర్లతో వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని
కలెక్టరేట్‌లో ఫిర్యాదుల కోసం హెల్ప్ డెస్క్–93908 30087
మొదటి విడతకు రెడీ