
సర్దుబాటుకు బ్రేక్!
● ఎన్నికల కోడ్‌కు ఎలా ముడిపెడుతారంటున్న ఉపాధ్యాయ సంఘాలు
● గాలిలో దీపంలా ఉపాధ్యాయుల
సర్దుబాటు ప్రక్రియ
● విద్యాశాఖ అధికారుల
తప్పిదాలతోనే కాలయాపన?
● బోధించేవారు లేక విద్యార్థులకు
తీరని నష్టం
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటుకు ముడిపెడుతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. సర్దుబాటు కోడ్ కిందకు వస్తుందా? అంటూ ఓ ఉన్నతాధికారి అనడంలో ఆంతర్యమేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు సైలెంట్‌గా వ్యవహరిస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి, కాలయాపన చేస్తున్నారని పలు ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. మొదటి విడత సర్దుబాటులో ఎంఈఓలు పలు తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, ఆ తప్పిదాలను సరిదిద్దడమే రెండో విడతలో ముఖ్య మని భావించారు. అయితే తాజాగా నిర్వహించిన రెండో విడత సర్దుబాటులో కూడా అదే పద్ధతి కొనసాగిందంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జిల్లా విద్యాశాఖలో ఐఏఎస్ అధికారి డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గందరగోళ పరిస్థితులపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన డీఈఓ రాకతో పారదర్శకత వస్తుందని భావించినప్పటికీ, సిబ్బంది అనుమతులు, బదిలీలు, సర్దుబాట్లలో జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లీకైన అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో 94 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో 70 మంది ఎస్‌జీటీలు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు.
ఈ ఎంపికల్లో కూడా అక్కడక్కడా లోపాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో అనేక ఆరో పణలు ఎదుర్కొన్నప్పటికీ, మళ్లీ అదే పునరావృతం కావడంతోనే డీఈఓ సర్దుబాటుకు వెనకాడుతున్నారని సమాచారం. జిల్లాలో ఎంఈఓలు ఎవరి కంట్రోల్‌లో పనిచేస్తున్నారని పలువురు టీచర్లు బాహాటంగానే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మరోవైపు ఎంఈఓల పరిస్థితి కూడా క్లిష్టంగా ఉందని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా, టీచర్ల సర్దుబాటు చేసేందుకు పలువురు ఎంఈఓలు వెనకాడడం లేదనే ఆరోపణలు విద్యాశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని కొడకండ్ల ఎంఈఓ ఓ విచారణ ఎదుర్కొంటుండగా, బచ్చన్నపేట మండలంలోని నక్కవానిగూడెం పీఎస్‌లో టీచర్ల నియామకం విషయంలో అక్కడి అధికారి నిర్లక్ష్యం విద్యారుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసినట్లు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన లేదు. ఉపాధ్యాయుల సర్దుబాటుపై జరుగుతున్న ఈ అనిశ్చితి, గందరగోళం విద్యారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.