రేపటినుంచి వేల్పుగొండ
జఫర్‌గఢ్: మండలకేంద్రంలో వేల్పుగొండ కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి జరగనున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు కొలుస్తుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు పొడిశేటి వెంకటాచార్యులు మాట్లాడుతూ..ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయన్నారు. 11న శ్రీలక్ష్మీనర్సింహా సుదర్శన హోమం, పూర్ణాహుతి, అరగింపు, తీర్థగోష్టి, 12న శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్సవం, 13న స్వామివారి చక్రస్నానం, పల్లకీసేవ, సాయంత్రం సమయంలో పుష్పయాగం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.