
పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
● జిల్లాలో 309 కేంద్రాలు
● అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమీక్ష
జనగామ రూరల్: గత రెండు సీజన్‌లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిందని..ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వానా కాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఆర్టీఓ, గన్ని గోదాం ఇన్‌చార్జ్ లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్‌తో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంటసాగు అయ్యిందని 5,43,057 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా 2,05,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. సన్నరకం మద్దతు ధర రూ.2389లు కాగా, బోనస్ క్వింటాల్‌కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే దొడ్డు రకానికి రూ.2369ల మద్దతు ధర ఉందన్నారు. దొడ్డురకం ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ 116, పీఏసీఎఎస్ 82 కేంద్రాలను, అలాగే సన్నరకం ఽకొనుగోలుకు 69 ఐకేపీ, 42 పీఏసీఎస్ సెంటర్ లను మొత్తం 309 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నమన్నారు.
కోడ్ పక్కాగా అమలుకావాలి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలయ్యేలా అధికారులు విధులను నిర్వహించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి..రేపటిలోగా నివేదిక ఇవ్వాలన్నారు.
స.హ.చట్టంపై అవగాహన అవసరం
సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు వారోత్సవాలను జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఏఎంసీలో రెండు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయండి
జనగామ: వానాకాలం సీజన్‌లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు వెసులుబాటు కల్పించే విధంగా జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో చీటకోడూరు, శామీర్‌పేటకు చెందిన ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను సోమవారం కోరారు. అనంతరం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో రెండు సెంటర్లు ప్రారంభించిన సమయంలో తాము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతీ రైతుకు సేవ చేస్తామన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన వెంట డీఆర్డీవో పీడీ వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, సూపర్‌వైజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు