జనగామ: డీజీపీ శశిధర్‌రెడ్డిని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హెచ్‌డబ్ల్యూబ్ల్యూ, ఎస్‌కేయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజి రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరా బాద్‌లోని ఆయన నివాసంలో డీజీపీని కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు.
రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ అవార్డు గ్రహీతకు సన్మానం
రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మాడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేశ్‌కు హైదరాబాద్‌కు చెందిన జటాదర ఎడ్యుకేషన్ టెక్నాలజీ వారు రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసి సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఇటీవల ప్రదానం చేశారు. సోమవారం మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, ఉపాధ్యాయులతో కలిసి అవార్డుగ్రహీత గణేశ్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గడ్డం జయశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నక్కవానిగూడెం పీఎస్‌కు టీచర్!
జనగామ: బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో డిప్యుటేషన్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ‘సర్దుబాటుపై జాప్యమెందుకు?’ శీర్షికన ఈ నెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నక్కవానిగూడెం పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి రావడంతో నెలరోజుల క్రితమే వెళ్లిపోయారు.
తాత్కాలికంగా మరో పాఠశాల నుంచి టీచర్‌ను నియమించాల్సిన ఎంఈవో నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరమైపోయారు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనంతో కలెక్టర్ ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స మాచారం. వెంటనే స్పందించిన ఎంఈవో అదే మండలంలోని పడమటి కేశ్వాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న టీచర్ ప్రియాంకను నక్కవాని గూడెం ప్రాథమిక పాఠశాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జాప్యంపై ఇంటెలిజెన్స్ ఆరా
జిల్లాలో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతోందనే కోణంలో సమగ్ర సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా పాఠశాలల పరిధిలో పదోన్నతులతో ఖాళీ అయిన టీచర్ల స్థానంలో గత నెల 4వ తేదీ వరకే సర్దుబాటు చేయాల్సి ఉండగా, నిర్లక్ష్యానికి కారణాలు ఏంటనే దానిపై కూపీలాగినట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.
దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్
హసన్‌పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
‘బెస్ట్’ నిధులు విడుదల చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సెయింట్ పీటర్ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద విద్యార్థులకు చెల్లిస్తున్న స్కాలర్‌షిప్స్ 2022 నుంచి 2025 పెండింగ్‌లో ఉండడంతో తమ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో 60మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.