
మునపటి జోరుంటుందా?
జనగామ: దసరా పండుగ ముగియడంతో జిల్లాలో మద్యం టెండర్ల హడావిడి మొదలైంది. జిల్లాలో మొత్తం 50 రిటైల్ లిక్కర్ షాపులకు 2025–27 రెండేళ్లకుగానూ గత నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సద్దుల బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఆశించిన మేర టెండర్లు రాలేదు. పండుగ సందడి ముగిసిపోవడంతో టెండర్‌దారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలోని మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 8 టెండర్లు రాగా, బుధవారం నుంచి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో రియల్టర్లు, వ్యాపారులతో పాటు కొత్త వ్యక్తులు ముందుకొస్తారా లేదా మునపటి జోరు ఉంటుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
రిజర్వేషన్లు కలిసి రాకుంటే
స్థానిక బీసీ రిజర్వేషన్లపై బుధవారం వెలువడనున్న హైకోర్టు తీర్పు మద్యం టెండర్లపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు తారుమారైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఆశించిన నాయకుల్లో పలువురు మద్యం టెండర్ల వైపు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎకై ్సజ్ శాఖకు ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు.
టెండర్లకు దూరంగా రియల్టర్లు,వ్యాపారులు?
గతంలో జిల్లాలో సుమారు తొమ్మిది టీములు ఏర్పడి పెద్దఎత్తున టెండర్లు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ గ్రూపులు దాదాపు 1400ల వరకు దరఖాస్తులు సమర్పించగా, ఈసారి సగం తగ్గించే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. భారీ ఖర్చు, టెండరు ఫీజు రూ.3లక్షలకు పెంచడం కారణంగా మునుపటి టెండర్ దారుల్లో మెజార్టీగా ఈసారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో వ్యూహాలకు పదును పెడుతోంది. పాత, కొత్త టెండర్ దారులకు మద్యం సేల్ విధానం, లైసెన్స్ నిబంధనలు, లాభ నష్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మద్యం షాపులపై ఆసక్తి ఉన్నవారు ఆర్థిక సన్నద్ధతతోపాటు చట్టపరమైన అవగాహన కూడా పెంచుకోవాలని ఈ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2023–2025 రెండేళ్లకు గాను జిల్లాలోని 47 వైన్స్‌లకు 2,356 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.47.12కోట్ల మేర ఆదాయం(నాన్ రిఫండబుల్) వచ్చింది. ఈ సారి 3 షాపులు పెరగడంతో మద్యం దుకాణాలు 50కి చేరాయి.
జిల్లాలో 8 టెండర్లు దాఖలు
వచ్చే రెండేళ్ల మద్యం అమ్మకాల కోసం ఎకై ్సజ్ శాఖ గత నెల 26న టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. చివరి గడువు దగ్గర పడుతుండడంతో టెండర్‌దారులు పెద్దఎత్తున డబ్బులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. శుభ ముహూర్తం చూసుకుని తమ ఇష్టదైవమైన దేవుళ్లను పూజించి టెండర్ వేసేందుకు పాత, కొత్త వ్యక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో కోట్లాది రూపాయలు భూములపై ఉండిపోయాయి. దీంతో మునుపటి జోరు ఉంటుందా లేదా అనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. టెండర్లు పెరగకపోయినా.. గతంలో వచ్చిన సంఖ్య తగ్గకూడదనే సంకల్పంతో ఎకై ్సజ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు 12 రోజుల వ్యవధిలో 8 మంది మాత్రమే టెండర్లు వేశారు. ఇందులో జనగామలో–1, పాలకుర్తి–4,, స్టేషన్‌ఘన్‌పూర్ సర్కిల్ పరిధిలో మరో–3 వచ్చాయి.
టెండరు దరఖాస్తులు వేసేది ఇక్కడే
రిటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. 21 సంవత్సరాలు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి దరఖాస్తుకు రూ.3లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం డీపీఈవో, జనగామ, సీపీఈ తెలంగాణ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు దరఖాస్తులను జిల్లా కేంద్రం వడ్లకొండ రోడ్డు ఇరిగేషన్ క్వార్టర్స్‌లోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ఏ దుకాణానికి అయినా దరఖాస్తు చేసుకోవాలనుకునే వ్యాపారులు తమ దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, కమిషనర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో కూడా ఇవ్వొచ్చని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పించాలని, మరిన్ని వివరాల కోసం https://tgbcl.telangana.gov.in/ts/index.php/site/login లో చూసుకోవచ్చన్నారు.