క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి కృషి

Oct 8 2025 6:49 AM | Updated on Oct 8 2025 2:38 PM

పాలకుర్తి టౌన్‌: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చర్చిలో నేషనల్‌ కౌన్సిల్‌ క్రిస్టియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్లు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు. నిరుపేద పాస్టర్లకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. కులం సర్టి ఫికెట్ల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో నేషనల్‌ కౌన్సిల్‌ క్రిస్టియన్‌ రాష్ట కార్యదర్శి అనంతోజు రక్షిత, బక్క ఏలియా, ఈవీ థామస్‌, ఎన్‌సీసీ జనగామ జిల్లా మహిళ అధ్యక్షురాలు డాక్టర్‌ ప్రీతిదయాల్‌ తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ ఫీజులు చెల్లించండి

జనగామ రూరల్‌: బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు బింగి రమేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలోని శ్రీ అరబిందో హైస్కూల్‌ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నరసింహ, పరశురాములు, యుగంధర్‌, వేణుభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముత్తిరెడ్డికి పరామర్శ

జనగామ: జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోదరుడు ముత్తిరెడ్డి కృష్ణారెడ్డి మృతి చెందగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ స్టేట్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి మంగళవారం ఆయనను పరామర్శించారు. అంతకుముందు కృష్ణారెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి కృష్ణారెడ్డి పాడే మోశారు.

ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షురూ

రామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫార్మస్యూటికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్‌సెట్‌ (బైపీసీ) కౌన్సెలింగ్‌ మంగళవారం వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్‌సెట్‌ అడ్మిషన్స్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బైరి ప్రభాకర్‌ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్‌ ఫ్రీజింగ్‌, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్‌సైట్‌ సందర్శించాలని ఆయన కోరారు.

పీఓహెచ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో వందేభారత్‌ రైలు మెగా మెయింటనెన్స్‌ పీఓహెచ్‌, ఆర్‌ఓహెచ్‌ ఫ్రైట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వేశాఖ రూ.908కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement