
పెండింగ్ వేతనాలు అందించాలి
జనగామ రూరల్: నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పండుగలకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే వేతనాలు మంజూరు చేయాలని మోడల్ స్కూల్ సిబ్బంది జిల్లా అధ్యక్షుడు జనార్దన్ కోరారు. సోమవారం తెలంగాణ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిజికల్ డైరెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్స్, నైట్ వాచ్‌మెన్‌లు జిల్లాలో 8 మోడల్ స్కూల్‌లో 32 మంది పనిచేస్తున్నారని అన్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. నిరసనలో జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, కోశాధికారి బాలు, రాజేశ్, వెంకటేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ సిబ్బంది నిరసన