
ఊరెళ్తే చెప్పండి!
ఇంటి పరిధిలో పోలీస్ నిఘా పెడుతాం
జనగామ: సద్దుల బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే నిఘా ఉంటుందని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. పండగ సమయంలో ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల ప్రశ్నలకు డీసీపీ సమాధానం ఇచ్చారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన సమయంలో 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. సైబర్‌లో మోసపోయిన సమయంలో గంట లోపు (గోల్డెన్ అవర్) 1930కి ఫోన్ చేస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వాటిపై నిత్యం ఫోకస్ ఉంటుందన్నారు. పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తోందన్నారు. 33 మందికి డీసీపీ సమాధానం చెప్పగా, మరో 60 వరకు మిస్డ్‌కాల్స్ వచ్చాయి.
ప్రశ్న: పండగల వేళ గస్తీ పెంచుతున్నారా..బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నారా..?
– నారోజు రామేశ్వరాచారి, జనగామ,
వడ్డెపల్లి యాకంరెడ్డి, బచ్చన్నపేట, యాకస్వామి,
రామవరం,కొడకండ్ల, కాట సుధాకర్, జఫర్‌గడ్,
పులి ధనుంజయ్‌గౌడ్, ఉప్పుగల్, జఫర్‌గడ్,
డీసీపీ: సద్దులు, దసరా పండగ సమయంలో బతుకమ్మకుంట వద్ద నిఘా పకడ్బందీగా ఉంటుంది. ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచుతాం. ఈవ్‌టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తాం. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎకై ్సజ్ శాఖకు సమాచారం ఇస్తాం.
ప్రశ్న: నవరాత్రుల పేరిట లక్కీ డ్రాతో మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా..?
– రేపాల అశోక్, పాలకుర్తి
డీసీపీ: లక్కీ డ్రా పేరిట మోసం చేసే వారిపై ఆరా తీస్తాం. ఈ విషయమై చర్యల కోసం ఎస్సైకి చెబుతాం.
ప్రశ్న: నెహ్రూపార్కు వద్ద వేగ నియంత్రణ, సిగ్నల్ ఏర్పాటు చేయాలి, ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్ న్రియంత్రించాలి..మైనర్ల డ్రైవింగ్‌పై కుల సంఘాలతో సమావేశం పెడుతారా..?
– గట్టు అమర్నాథ్, ఎల్‌ఐసీ అధికారి, ఎండీ రియాజ్, జనగామ, రవీంద్రచారి, పోచన్నపేట, బచ్చన్నపేట, జంగిటి సిద్దులు, బచ్చన్నపేట, రాపెల్లి వెంకటేశ్,
ఎన్‌జీవో, బచ్చన్నపేట
డీసీపీ: నెహ్రూపార్కు వద్ద ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్‌పై నిఘా మరింత పెంచుతాం. మైనర్, యూత్ ర్యాష్ డ్రైవింగ్‌పై తనిఖీలు పెంచి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.చెరువుల వద్ద భద్రత విషయమై రెవెన్యూ శాఖకు సమాచారం ఇస్తాం. కులసంఘాలతో సమావేశ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం.
ప్రశ్న: సైబర్‌లో మోసపోతే ఎలా?
– ఈగ కృష్ణమూర్తి కూనూరు, జఫర్‌గడ్
డీసీపీ: సైబర్‌లో మోసపోతే గోల్డెన్ అవర్ ఉంటుంది. మోసపోయిన గంటలో 1930కి కాల్ చేసి సమాచారం అందిస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. వాట్సాప్‌లో వచ్చే ఎపిక్ లింకులను ఓపెన్ చేయొద్దు.
ప్రశ్న: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై చర్యలు తీసుకుంటున్నారా.. ఆటోల్లో సౌండ్ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు.. దసరా సమయంలో ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ అమలుచేస్తారా?..
– దరావత్ రాజేశ్ నాయక్, మైదం చెరువు తండా,
కొడకండ్ల, సారంగపాణి, జఫర్‌గడ్, తాటికాయల అశోక్, మాజీ సర్పంచ్, ఇమ్మత్‌నగర్, జఫర్‌గడ్
డీసీపీ: డ్రంకెన్ డ్రైవ్ మరింత పెంచుతాం. దీంతో తిరుమలగిరి, ఈదుల పర్రెతండా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికడుతాం. ఓపెన్ ఏరి యాలో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తాం. డ్రెస్‌కోడ్ విషయంలో కలెక్టర్‌కు వివరిస్తాం. అటోల సౌండ్ సిస్టం విషయమై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులకు సైతం సమాచారం ఇస్తాం.
ప్రశ్న: బెల్ట్ షాపుల్లో అమ్మకాలు.. అనాథాశ్రమాలకు డొనేషన్లు నియంత్రణకు ఏం చేస్తారు..?డ్రగ్స్ క్యాంపెయిన్‌లను నిర్వహిస్తున్నారా..?
– బంగ్ల శ్రీనివాస్‌గౌడ్, స్టేషన్‌ఘన్‌పూర్,
దుంపల సంపత్, పాలకుర్తి, అన్వర్, జనగామ,
విద్యాసాగర్, కొన్నె, బచ్చన్నపేట
డీసీపీ: బెల్ట్ షాపుల నిర్వహణపై ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అనాథలకు డొనేషన్ పేరిట తిరిగేవారు ముందస్తుగా పోలీస్ స్టేషన్, మునిసిపల్ అనుమతులు తీసుకునేలా చూస్తాం. కలెక్టర్, పోలీసు శాఖ సంయుక్తంగా డ్రగ్స్ నిర్మూలన కోసం అవెర్‌నెస్ క్యాంపులు, ర్యాలీలు చేపడుతున్నాం. బ్లాక్ టీషర్టు వేసుకుని వచ్చే సమయంలో రహస్యంగా వీడియో తీయండి. పక్కా సమాచారం ఇస్తే పోలీసులు నిఘా ఉంచుతారు.
ప్రశ్న: అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెడుతున్నారా? గ్రామాల్లో యువకులతో కమిటీ వేసే ఆలోచన ఉందా?
– సందీప్‌కుమార్, జనగామ, ధర్మకంచ మినీస్టేడియం, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం
డీసీపీ: అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలి. వీలైతే సీక్రెట్‌గా వీడియో తీసి మాకు పంపించండి. పోలీసు టూ వీలర్ వెహికిల్‌కు సైరన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల పరిధిలో యువకులతో కమిటీలు వేసి నిఘా పెంచే ఆలోచనను పరిగణలోకి తీసుకుంటాం.
ప్రశ్న: శ్రీ సోమేశ్వర ఆలయ గుట్ట చుట్టూ మద్యం తాగేవారిపై చర్యలు?
– కామారపు సునీల్, పాలకుర్తి
డీసీపీ: గుట్టచుట్టూ ఇలాంటి కార్యక్రమాలు జరుగకుండా పోలీసుశాఖ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఎవరైనా మద్యం తాగుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్‌బీఎఫ్ సంస్థకు సంబంధించి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ చేస్తాం.
ప్రశ్న: పెట్రోలింగ్ పెంచుతారా..బ్యాటరీల చోరీలపై చర్యలు తీసుకుంటున్నారా?
– కాసుల శ్రీనివాస్, శ్రీనగర్ కాలనీ, జనగామ,
జమాల్‌షరీఫ్, న్యాయవాది, జనగామ,
బోరెం నరేందర్‌రెడ్డి, పెద్దమడూరు, దేవరుప్పుల
డీసీపీ: ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీ పెద్దలు ముందుకు రావాలి. గిర్నిగడ్డ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్ పెంచుతాం. అనుమానితులు కనిపిస్తే 100కు డయల్ చేయండి. గతంలో చోరీకి గురైన బ్యాటరీల గురించి పీఎస్‌లో ఫిర్యాదు చేయండి.
ప్రశ్న: పండగకు ఊరెళితే ఏం చేయాలి? చైన్‌స్నాచింగ్‌లపై చర్యలు తీసుకుంటున్నారా?
– శంకర్, కొర్రతండా, గానుగుపహాడ్, జనగామ, అజహరొద్దీన్,
జనగామ, రొడ్రిక్ రాజు,జనగామ
డీసీపీ: పండగకు ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి సమాచారం ఇవ్వండి. ఇంటి పరిసర ప్రాంతంలో పోలీసు నిఘా ఉంటుంది. పట్టణంలో 150 కెమెరాల ద్వారా నిఘా ఉంది. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచింది. పెట్రోలింగ్ రెగ్యులర్‌గా ఉంటుంది. పట్టణంలో చాలా వరకు చోరీలు, చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. ప్రతిచోట నిఘా ఉంది. దానిని రెట్టింపు చేస్తాం.
విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది
100 డయల్‌ను సద్వినియోగం చేసుకోండి
సద్దులు, దసరా పండగ సమయంలో పటిష్ట బందోబస్తు
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్

ఊరెళ్తే చెప్పండి!