నిధుల సమీకరణ..! | - | Sakshi
Sakshi News home page

నిధుల సమీకరణ..!

Sep 27 2025 4:53 AM | Updated on Sep 27 2025 4:53 AM

నిధుల సమీకరణ..!

నిధుల సమీకరణ..!

మద్యం షాపులకు పెద్దమొత్తంలో దరఖాస్తులకు ప్లాన్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

● 2023–25 సంవత్సరానికి జరిగిన టెండర్‌లలో హనుమకొండ చెందిన ఓ మద్యం వ్యాపారి కొందరిని కలుపుకుని ట్రైసిటీతోపాటు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలువురి పేర్లపై 600 (రూ. 12 కోట్లు ఖర్చు చేసి) దరఖాస్తులు వేశా రు. మొ త్తంగా ఆ కూటమి.. 32 దుకాణా లను (లక్కీ డ్రా, గుడ్‌విల్‌ పద్ధతిన) కై వసం చేసుకుంది.

● జేఎస్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత ఆబ్కారీ సీజన్‌లో హనుమకొండ, పరకాల, రేగొండ తదితర ప్రాంతాల్లో మొత్తం 70 వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేశారు. ఒక్కో రూ.2 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు దరఖాస్తుల ఖర్చు కాగా.. రెండు లక్కీడ్రాలో రాగా, ఒకటి గుడ్‌విల్‌ ఇచ్చి సొంతం చేసుకున్నారు.

... ఈసారి కూడా మద్యంషాపుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అమ్ముడు పోతాయని ఆబ్కారీశాఖ భావిస్తోంది. గతేడాది ఉమ్మడి వరంగల్‌లో 294 వైన్స్‌ (ఏ–4)షాపులకు 15,926 దరఖాస్తులు దాఖలయ్యాయి. అప్పుడు దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. 15,926 దరఖాస్తులపైన రూ.318.52 కోట్లు నాన్‌ రిఫండబుల్‌గా ఆబ్కారీశాఖకు ఆదాయం సమకూరింది. ఈసారి ఎంపీటీసీ, సర్పంచ్‌, జెడ్పీటీసీ, సింగిల్‌ విండో, మున్సిపల్‌ తదితర స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సమ్మక్క–సారలమ్మల జాతర కూడా ఉంది. ఈ లెక్కన ఈసారి దరఖాస్తుల సంఖ్య 20 వేల వరకు పెరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.

ఈ దుకాణాలపైన ప్రత్యేక గురి..

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా అత్యధికంగా విక్రయాలు జరిగే వైన్‌షాపులపై వ్యాపారుల సిండికేట్‌ గురిపెట్టింది. పాత వ్యాపారులతోపాటు కొత్తగా ఈ దందాలోకి దిగేవారు అధికారులను సంప్రదించి ఓ జాబితా తయారు చేసుకున్నట్లు సిండికేట్‌ వర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ప్రతీ సంవత్సరం రూ.2,250 కోట్ల నుంచి రూ.2,590 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మూడేళ్లలో అత్యధికంగా విక్రయాలు జరిగిన షాపులకు ఈసారి ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంది. కాగా గతంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ వైన్స్‌ ఒక్క ఏడాదిలో రూ.61.04 కోట్లు, హనుమకొండ సిటీ హంటర్‌రోడ్‌లోని ఓ వైన్స్‌ అత్యధికంగా రూ.38.21 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా తొర్రూరులోని ఓ వైన్స్‌ రూ.14.33 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. తొర్రూరులోనే మరో మరో వైన్స్‌ రూ.6.5 కోట్లు, కమలాపూర్‌ మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో రూ.6,39,82,000ల విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్‌ రూ.9.35 కోట్ల మద్యం విక్రయించగా, పాలకుర్తిలోని వైన్స్‌లో రూ.14.19 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో మరో ఎనిమిది, భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, చిట్యాలలతోపాటు ఆరు, ములుగు జిల్లాలో ఏటూరునాగారం, ములుగు, మేడారం, పస్రాలతో పాటు మేడారం రూట్‌లోని అన్ని షాపులలో విక్రయాలు బాగా జరుగుతాయి. మొత్తం 294 షాపులలో 150 దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు పడుతాయని భావిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

మద్యం దందావైపు

‘రియల్‌’ వ్యాపారులు..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మద్యం దందావైపు చూస్తున్నారు. మార్కెట్‌ అప్‌ అండ్‌ డౌన్స్‌ నేపథ్యంలో 2023–25 నుంచే కొందరు లిక్కర్‌ వ్యాపారంలో అడుగు పెట్టారు. ఈసారి ఇప్పుడున్న వ్యాపారులకు తోడు తాము సైతం అదృష్టం పరీక్షించుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2025–27 సంవత్సరానికి శుక్రవారంనుంచి టెండర్‌ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టెండర్‌లలో వైన్స్‌ (ఏ–4)షాపులు అత్యధికంగా దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులతో కలిసి ‘సిండికేట్‌’ అవుతున్నారు. మరోవైపు కొందరు రాజకీయ నాయకుల బినామీలు కూడా ఈసారి పెద్దసంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో పేరుగాంచిన వ్యాపారులే మళ్లీ అత్యధిక దుకాణాలు దక్కించుకునేందుకు గ్రూపులుగా ఏర్పడుతున్నారు. నిర్ణీత సమయంలో షెడ్యూల్స్‌ దాఖలు చేయడంతోపాటు టెండర్‌ల ద్వారా ‘లక్కీ’ వరిస్తే సరి.. లేదా దుకాణాలు దక్కే కొత్తోళ్లకు రూ.లక్షల గుడ్‌విల్‌ ఇచ్చి కై వసం చేసుకునేందుకు ఇప్పటినుంచి నిధులు సమీకరిస్తున్నారు. పాత మద్యం వ్యాపారులు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. రాజకీయ నేతల బినామీలు.. ఇలా పోటాపోటీగా టెండర్‌లకు సిద్ధమవుతుండటం వైన్‌షాపులకు ఈసారి భలే గిరాకీ ఉండబోతుంది.

మద్యం దందాలో ‘రియల్‌‘ వ్యాపారులు

రంగంలోకి రాజకీయ నేతల బినామీలు

అత్యధికంగా షాపులు దక్కించుకోవడమే

లక్ష్యంగా ‘సిండికేట్‌’

ఉమ్మడి వరంగల్‌లో 294 షాపులు..

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement