
నాణ్యతగా
మూడు చోట్ల 50శాతం పనులు పూర్తి
నిరంతరం..
సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి చర్చిస్తున్న ఉన్నతాధికారులు
● మూడు చోట్ల స్థల కేటాయింపుల్లో జాప్యం
● ఫీడర్లపై తగ్గనున్న భారం
● లో ఓల్టేజీ సమస్యలకు పరిష్కారం
● రూ.22.50కోట్లు మంజూరు
జనగామ: జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది 33/11కేవీ సబ్‌స్టేషన్లకు మంజూరు ఇచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా, మరికొన్ని చోట్ల స్థల కేటాయింపులు పూర్తి కావాల్సి ఉంది. నూతన సబ్‌స్టేషన్ల సేవలు ప్రారంభం కాగానే గ్రామాల పరిధిలో తరచూ ఎదురవుతున్న లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. దీంతోపాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి అవకాశం కలుగుతుంది.
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 33/11కేవీ సబ్‌స్టేషన్లు 78 ఉన్నాయి. 9 సబ్‌స్టేషన్లు అందుబా టులోకి వస్తే 87కు పెరగనున్నాయి. 132/33 కేవీ –12, 220/132 కేవీ–1, 400 కేవీ–1 సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, ఇండస్ట్రియల్, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ, స్ట్రీట్, స్కూల్స్, టెంపుల్స్ తదితర కనెక్షన్లు 2, 96, 779 ఉన్నాయి. జిల్లాలో కొత్తగా తొమ్మిది 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశారు.
జిల్లాలో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం రూ.22.50 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను వినియోగిస్తూ ఆధునిక సాంకేతికతతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యు త్ పంపిణీ నాణ్యత మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, గృహాల అవసరాలకు సరిపడే విద్యుత్ అందుబాటులోకి రానుంది.
దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో 220/132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణపనులు కొద్దిరో జుల్లో పట్టాలెక్కనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 15 ఎకరాల భూమి కేటాయింపు పూర్తికాగా, హద్దులు నిర్ణయించి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అతి పెద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుంటే సమీపంలోని మండలాలకు మరింత నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా అందించవచ్చు. భారీ లోడ్లను కూడా సులభంగా మోహరించగల సామర్థ్యం ఈ సబ్‌స్టేషన్‌కు ఉండబోతోంది.
బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల కేటా యింపుల్లో జాప్యం జరుగుతోంది. సబ్‌స్టేషన్‌కు భూమి కేటాయింపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఈ సమస్యను జఠిలం చేస్తే ఊరికి వచ్చే సబ్‌స్టేషన్‌ను మరోచోటకు మళ్లించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి, ముత్తారం గ్రామాల్లో సబ్‌స్టేషన్ల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే నిర్మాణం మొదలయ్యేలోపు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. స్థల సమీకరణ సమయంలో సమస్య ఉత్పన్నం కావడంతో పనులు ప్రారంభించలేకపోతున్నారు. అధికారులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకు తున్నారు.
జిల్లాలోని చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్‌గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి మూడ గ్రామాల్లో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు 50శాతం వరకు పూర్తయ్యాయి. కొండాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో కొండాపూర్, శ్రీపతిపల్లి, కొమ్ముగుట్ట, లింగంపల్లి (సగం) ఫీడర్లు బదిలీ కానుండడంతో విద్యుత్తులో మరింత నాణ్యత పెరగనుంది. సాగరం సబ్‌స్టేషన్‌కు సాగరం, తిగుడు, కొనాయచలం, కుర్చపల్లి సబ్‌స్టేషన్‌కు అనుసంధానంగా ఇప్పగూడెం, రాఘవాపురం, గోవర్ధనగిరి గ్రామాల పరిధిలోని సగం ఫీడర్లు కలువనున్నాయి. లింగంపల్లి, పత్తేషాపూర్ 33 /11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు టెండరు పూర్తి కాగా, జనగామ మండలం వడ్లకొండ సబ్‌స్టేషన్ పనులకు సంబంధించి టెండరు స్టేజీలో ఉంది. విద్యుత్ సబ్ స్టేషన్లు పూర్తయ్యాక జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్యలు తగ్గి, నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, గృహ వినియోగం, చిన్నతరహా పరిశ్రమలకు ఊరట కలిగించే విషయం.

నాణ్యతగా