
ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా
జనగామ: దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ టికెట్‌పై పేరు, ఫోన్ నెంబర్, చిరునామా రాసి సంబంధిత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బాక్స్‌లలో వేయాలన్నారు. అక్టోబర్ 8న సాయంత్రం 4 గంటలకు ఆయా ప్రాంతీయ కార్యాలయాల్లో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందన్నారు. ప్రతీ ప్రాంతం నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ స్వాతి సూచించారు.