
సామాన్యులకు ఊరట!
జనగామ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి, చిరు ఉ ద్యోగ కుటుంబాలకు ఊరట కలిగించాయి. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబ్‌లు అమలులో ఉండగా, కొత్త విధానంతో ఇప్పుడు 5 నుంచి 18 శాతం వరకు ఒకే శ్లాబ్‌లను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు, గృహిణులు, విద్యార్థులు, యువత లాంటి అన్ని వర్గాలకు భారీగా లాభం చేకూరనుంది.
రెండు శ్లాబ్‌లు మాత్రమే..
జీఎస్టీపై కేంద్రం కొత్త నిర్ణయం అమలులోకి రావడంతో కార్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కుక్కర్, టీవీల ధరలు తగ్గడంతో సామాన్యులు సైతం సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభిస్తోంది. ఈ మార్పు చిన్న ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనం కలిగించనుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మా త్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జోరందుకోనున్న వ్యాపారాలు..
జీఎస్టీ కొత్త విధానాలతో వ్యాపారాలు జోరందుకోనుండగా... సామాన్యుపై ఆర్థిక భారం తగ్గనుంది. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీలపై రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగొచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ 5 శాతం జీఎస్టీకి చేరుకోవడంతో రూ.200 నుంచి రూ.400 వరకు తగ్గాయి. ద్విచక్రవాహనా లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ప్రస్తుతం 18 శాతానికి తీసుకు రాగా 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గిముఖం పట్టడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. జీఎస్టీ తగ్గుముఖంతో అన్ని వర్గాల ప్రజలకు ప్ర యోజనం చేకూరే విధంగా ఉంది.
జీఎస్టీ సంస్కరణలతో పేద,
మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషం
టీవీ, కార్లు, బైక్‌లపై ధరలు తగ్గుముఖం
చిరు ఉద్యోగులపై తగ్గిన ఆర్థికభారం
పెరిగిన వ్యాపారం
జీఎస్టీకి తోడు షోరూంల ఆఫర్