
పల్లె పల్లె పూలసంద్రం
ఘనంగా మొదలైన పూలపండుగ
● మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
● అంబరాన్నంటిన ఆడపడుచుల సంబురం
● డీజే పాటలతో మార్మోగిన ఊరూవాడ
జనగామ: రాష్ట్ర పండగ బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలు స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాల పరిధిలో ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్కపూలు పోగేసి తీర్చిదిద్దిన బతుకమ్మలతో సాయంత్రం సంధ్యావేళ అన్ని గ్రామాలు ఆధ్యాత్మిక తన్మయత్వంతో నిండిపోయాయి. యువతులు, మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. మండలాల పరిధిలో చెరువుల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసి, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జనగామలోని రంగప్ప చెరువు, బతుకమ్మ కుంట, పాలకుర్తి ఊరచెరువు, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని దేవాదుల రిజర్వాయర్ తదితర ప్రాంతాల వద్ద బతుకమ్మ సంబురాలను నిర్వహించి, అక్కడే నిమజ్జనం చేశారు.
ఆడపడుచుల ఆటాపాట..
సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండగతో కొత్తకళ సంతరించుకుంది. మహిళలు, యువతులు కొత్తబట్టలు ధరించి, గౌరమ్మగా భావించే బతుకమ్మలను చేతపట్టుకుని ఆటలాడేందుకు బయలుదేరారు. బతుకమ్మ సంబురాలతో జనగామ పురవీధులు శోభాయానమయ్యాయి. ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డు మీదుగా బతుకమ్మకుంట వరకు మహిళలు బారులు తీరారు. ధర్మకంచ, గిర్నిగడ్డ, పాతబీటు బజారు, గ్రేయిన్ మార్కెట్, తహసీల్ కార్యాలయం, కుర్మవాడ, బాణాపురం, గణే ష్ స్ట్రీట్, వీవర్స్ కాలనీ, శ్రీ రామలింగేశ్వరస్వామి టెంపుల్, జీఎంఆర్ కాలలనీ, జ్యోతినగర్, గుండ్లగడ్డ, హౌజింగ్‌బోర్డు, అంబేడ్కర్‌నగర్, భవానీనగర్, శివాలయం, శ్రీవిల్లాస్, బాలాజీ, సాయినగర్, శ్రీ సాయి రెసిడెన్సీ, గీతానగర్, ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసే సమయంలో మహిహిళలు గౌరమ్మను ఇచ్చి పుచ్చుకుంటూ శ్రీశ్రీలక్ష్మీ నీమహిమలూ గౌరమ్మ, చిత్రమైతోచునమ్మా, భారతీ సతివయ్యూ బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవీవై, పరమేశురాణివై, శ్రీలక్ష్మీవయ్యూ గౌరమ్మ, భార్యవైతివి, ముక్కోటి దేవతలు.. శ్రీఅంటూ గౌరీదేవి స్తోత్రం పాడి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. సూర్యాపేట, సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ రోడ్డుపై ఇంటర్ సెప్టార్, బ్లూకోర్టు, క్రైం పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు.
వరుణుడి ఆటంకం..
బతుకమ్మ సంబురాల సమయంలో ఒక్కసారిగా జోరు వర్షం కురియడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో మునిసిపల కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, సుమారు 2వేల మంది మహిళలు సంబురాల్లో పాల్గొన్నారు.