
నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
జనగామ: దసరా పండగలో భాగంగా ఏటా నిర్వహించే శ్రీదేవీ దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల కోసం జిల్లాలో నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. శక్తి స్వరూపిణి అమ్మవారి వేడుకలకు మండపాలు ముస్తాబయ్యాయి. మండపాలు విద్యుత్తు దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. అమ్మవారి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. 10 ఫీట్ల నుంచి 20 ఫీట్ల ఎత్తులో ఉన్న విగ్రహాలను నిర్వహకులు కొనుగోలు చేశారు. ఈసారి 11 రోజుల పాటు దుర్గామాత ఉత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఏరియా, పాతబీటు బజార్, అంబేడ్కర్‌నగర్, వీవర్స్ కాలనీ, రెడ్డి స్ట్రీట్ (సుభాష్ బొమ్మ), అంబేడ్కర్ చౌరస్తా, గిర్నిగడ్డ, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత ఆలయంతో పాటు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాల కేంద్రాల పరిధిలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరిపించేందుకు ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
45 ఏళ్లుగా శ్రీదేవి దుర్గామాత ఉత్సవాలు
జిల్లాకేంద్రంలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో 45 ఏళ్లుగా శ్రీ దేవీ దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు వస్తారు. ప్రతి రోజు హోమాలు, కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో విలసిల్లుతుంది. 1981లో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాయి. చివరిరోజు రథసేవ (ఊరేగింపు)తో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
శ్రీసోమేశ్వరాలయంలో..
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న తెలిపారు. 22న శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా, 23న శ్రీగాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న శ్రీకాత్యాయనీ దేవి, 26న శ్రీమహాలక్ష్మీదేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరిదేవి, 28న శ్రీమహాచండీదేవి, 29న శ్రీసరస్వతి దేవి, 30న శ్రీదుర్గాదేవి, ఆక్టోబర్ 1న శ్రీమహిషాసురమర్ధినీ దేవి, 2న శ్రీరాజరాజేశ్వరీదేవిగా చండిక అమ్మవారి అలంకరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం శమీ పూజతో ఉత్సవాలు ముగిస్తాయని తెలిపారు.
జిల్లాలో ముస్తాబైన మండపాలు
శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో 45 ఏళ్లుగా ఉత్సవాలు

నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు