
అడుగడుగునా నిఘా
జనగామ: బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా పట్టణంలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ (ఐపీఎస్) పండేరి చేతన్ నితిన్ అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు నర్మెట సీఐ అబ్బయ్యగౌడ్, ఎస్సైలు భరత్, నగేష్, చెన్నకేశవులు ఆధ్వర్యంలో శనివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. నాలుగు రోడ్ల జంక్షన్‌లో పోలీసులు వలయాకారంగా బందోబస్తు చేపట్టి, వాహన పత్రాలతో పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ పండగ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే సమయంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. బతుకమ్మ, దసరా పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు, నిఘా ఉంచుతున్నారన్నారు.