స్థానికం’పై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానికం’పై సందిగ్ధం

Oct 6 2025 2:26 AM | Updated on Oct 6 2025 2:26 AM

స్థానికం’పై సందిగ్ధం

స్థానికం’పై సందిగ్ధం

● ‘జనరల్‌’ ఆశావహుల్లో ఉత్కంఠ ● బీసీ రిజర్వేషన్‌పై నేడు సుప్రీంకోర్టులో.. ఈనెల 8న హైకోర్టులో విచారణ ● ఆసక్తి రేపుతున్న రాజకీయం

● ‘జనరల్‌’ ఆశావహుల్లో ఉత్కంఠ ● బీసీ రిజర్వేషన్‌పై నేడు సుప్రీంకోర్టులో.. ఈనెల 8న హైకోర్టులో విచారణ ● ఆసక్తి రేపుతున్న రాజకీయం

జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికలపై స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే ఎలా ముందుకెళ్తారు..? కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు ప్రకటించినట్లు 42 శాతం రిజర్వేషన్‌తోనేనా..? లేక మరేదైనా జరగనుందా..? అన్న సందిగ్ధం నెలకొంది. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఇన్ని అనుమానాలకు తావిస్తోంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తీర్పు ఎలా ఉండబోతోంది..? స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే దానిపై గ్రామాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పోటీ చేయాలనుకుంటున్న జనరల్‌ ఆశావహులు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు, 20 ఎంపీపీ స్థానాలు, 216 ఎంపీటీసీ స్థానాలు, 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కాగా మొదటి నుంచే పదవులపై కన్నేసిన కొందరు నాయకులకు 42శాతం బీసీ రిజర్వేషన్లు కలిసి వచ్చాయి. జెడ్పీటీసీ స్థానాలతోపాటు, ఎంపీపీ స్థానాలు నాలుగు చొప్పున పెరిగాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలతోపాటు గ్రామ పంచాయతీలు కూ డా అదనంగా పెరిగాయి. దీంతో బీసీల్లో కొంత ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో రిజర్వేషన్‌పై కొందరు సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లడంతో తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఆశావహుల్లో నెలకొంది.

ఆచీతూచి అడుగులు

ఎన్నికల్లో పోటీలో ఉండాలనుకున్న నాయకులు ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే పెట్టుబడి (ఎన్నికల ఖర్చు) పెడితే.. ఒకవేళ ఎన్నికలు వాయిదాపడితే ఎలా అని మదనపడుతున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టుల తీర్పుతో ప్రతికూల వాతావరణం ఏర్పడితే అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగితే జనరల్‌లో ఉన్న అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. అలాగని రిజర్వేషన్లు మారితే బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించి సీట్లు కేటాయించారు. కోర్టు తీర్పును బట్టి ఆశావహులు ముందుకుసాగే అవకాశం కనిపిస్తోంది. రిజర్వేషన్లు మారినా ఎస్సీ, ఎస్టీల స్థానాల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థుల నిర్ణయంపై..

జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థుల వేటలో పడ్డాయి. అధికార పార్టీ అభ్యర్థులు కొందరు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. రిజర్వేషన్‌ అనుకూలించిందని, తమకు పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి చూపిస్తామని వారికి అభయం ఇస్తున్నారు. మరోవైపు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. మాజీమంత్రి, సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి ఇప్పటికే తన వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లతో జాబితాను తయారుచేసి అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా తన వర్గానికి చెందిన వారి పేర్లతో జాబితాను రూపొందించి అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. ఈ రెండు జాబితాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న అంశంపై కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement