
జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన మహిళ..
● కనికరం చూపని వైద్యసిబ్బంది ● ఆస్పత్రి ఎదుటే నిరీక్షించిన వైనం ● మీడియా చొరవతో అడ్మిట్ చేసుకున్న వైద్యులు
జగిత్యాల: జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రాగా కనీసం పరీక్షించకుండానే వైద్యులు తిప్పి పంపిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన లక్ష్మీ అనే మహిళ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమె వెంట ఎవరూ లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ‘సారూ జ్వరంగా ఉంది. కొంచెం చూడండి.. గోలీ అయినా ఇవ్వండి.. దండంపెడతా..’ అంటూ మొరపెట్టుకుంది. దీనికి వైద్యులు అత్యవసర కేసైతేనే పరీక్షిస్తామంటూ అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో ఒంట్లో సత్తువా లేని లక్ష్మి ఆస్పత్రి ఎదుట ఉన్న బెంచ్‌పై పడుకుంది. కొందరు పాత్రికేయులు ఆమెను గమనించి.. ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. జరిగిన విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకుని వైద్యులకు సమాచారం అందించారు. ఆమెను ఎందుకలా వెనక్కి పంపించారని ప్రశ్నించడంతో వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు.