
హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
మెట్‌పల్లి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడానికి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులతో పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వివరించాలన్నారు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, బీఆర్‌ఎస్ శ్రేణులు సమష్టిగా పని చేస్తే ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతి వర్గానికి మేలు జరిగేలా పాలన అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, ఇది కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలను ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని ఆయన స్పష్టం చేశారు.