
సెల్యూట్ ‘108’
సేవలోనే మాకు అసలైన పండగ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలుతుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రాధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రాణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సైతం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు.
దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు.
ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరి గాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు.
పండుగలు, ఉత్సవాలు ఏవైనా మాకు సాదారణ రోజులుగానే భావిస్తాం. ప్రమాదాలు జరిగాయని మాకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వారిని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తాం. గతంలో కన్నా ఈ ఏడాది దసరా రోజు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మా సిబ్బంది నిర్విరామంగా పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు.
– జనార్దన్, ప్రోగ్రాం మేనేజర్

సెల్యూట్ ‘108’