మామూళ్ల మతలబు..!?
కోరుట్ల: ‘నవ్విపోదురు గాక.. మాకేంటి..’ అన్న నానుడిని గుర్తు తెస్తుంది కోరుట్ల రెవెన్యూ అధికారుల తీరు. మూడు రోజుల క్రితం ఇసుక వ్యాపారి ఒకరు రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కొట్టడం..సెల్‌ఫోన్ లాక్కున్న సంఘటన జరిగింది. ఈ దాడి వీడియో సైతం వైరల్ అవుతోంది. ఇంత జరిగినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి పోలీసులకు ఫిర్యాదు ఎందుకు రాలేదన్న విషయం చర్చనీయంగా మారింది. దీని వెనుక అసలు మతలబు ఏమిటన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. దాడి సమయంలో సదరు వ్యక్తి రెవెన్యూ మామూళ్ల ప్రస్తావన తీయడం.. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనన్న కారణంగానే దాడి జరిగినా సిబ్బంది ఉలుకుపలుకు లేకుండా పిర్యాదు చేయడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లెక్క లేని లారీలు..
కోరుట్ల మండలం నాగులపేట సరిహద్దుల్లో కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి–బొమ్మెన శివారు వాగులో పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. తక్కళ్లపల్లి బొమ్మెన వాగు నుంచి నాగులపేట, సంగెం గ్రామాల మీదుగా కోరుట్ల శివారులో ఉన్న జాతీయ రహదారిపైకి ఇసుక లారీలు వస్తాయి. అక్కడి నుంచి జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్ వైపు లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా సరాఫరా అవుతోంది. ప్రతీరోజు సాయంత్రం 6–7 గంటల సమయంలో కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి–బొమ్మెన వాగు నుంచి ఇసుక తెచ్చుకోవడానికి పదుల సంఖ్యలో లారీలు కోరుట్ల జాతీయ రహదారి మీదుగా వెళ్తాయి. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు వాగులో ఇసుక నింపుకున్న లారీలు వరుసగా మళ్లీ కోరుట్లకు చేరుకుని నాగులపేట క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి మీదుగా జగిత్యాల, మెట్‌పల్లి, ఆర్మూర్ పట్టణాలకు ఇసుక తరలివెళ్తున్నాయి. ఈ విషయం ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ కథలాపూర్, కోరుట్ల రెవెన్యూ అధికారులకు మాత్రం అక్రమ ఇసుక లారీల ఆచూకీ కనిపెట్టడం గగనతరంగా మారింది.
లింకులు వెలుగులోకి..
ఇసుక అక్రమార్కులతో కోరుట్ల రెవెన్యూ సిబ్బందిలో కొందరికి ఉన్న లింకులు మూడు రోజుల క్రితం జరిగినా దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాడి సమయంలో సదరు వ్యక్తి మాముళ్ల ప్రస్తావన పదేపదే తెస్తూ గట్టిగా అరవడం గమనార్హం. కోరుట్ల, కథలాపూర్ పరిసరాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారికి రెవెన్యూ సిబ్బందితో లింకులు ఉన్నాయన్న అంశం ఈ సంఘటనతో తేటతెల్లమయింది. రెవెన్యూ సిబ్బంది అండతో ఇసుక అక్రమ రవాణాదారులు గ్రూపులుగా మారి తమలో తామే ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈక్రమంలో కొంత మంది రెవెన్యూ సిబ్బంది రాత్రివేళ ఓ గ్రూపు ఇసుక అక్రమార్కుల కారుల్లోనే నిఘా కోసం తిరుగుతూ ఎదుటి గ్రూపుల వారి ఇసుక లారీలు పట్టుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. చివరికి రెండు గ్రూపులు మామూళ్ల సెటిల్‌మెంట్ చేసుకునే వరకు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాత్రివేళ నిఘా పేరిట ఇసుక అక్రమ రవాణాదారులతో కలిసి విందులు చేసుకోవడం ఇక్కడ షరామాములుగా మారింది. ఫలితంగానే రెవెన్యూ సిబ్బందిపై ఇసుక అక్రమార్కులకు కొంత చులకన భావం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి. ఈక్రమంలోనే రెవెన్యూ సిబ్బంది మొక్కుబడిగా అడపదడపా ఇసుకను పట్టుకుంటే ఇలాంటి దాడులు చోటు చేసుకుంటున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంత బహిరంగంగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న క్రమంలో రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలియదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కథలాపూర్, కోరుట్ల మండలాల రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. వారానికి ఒక రోజు తూతూ మంత్రంగా ఓ లారీని పట్టుకుని రూ.20–30 వేల జరిమానా వేసి వదిలేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో లారీలు వెళ్తున్నా కేవలం వారానికి ఒకటి రెండుకు మించి రెవెన్యూ సిబ్బందికి దొరకడం లేదంటే దీని వెనుక మామూళ్ల మతలబు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.