
జీవ ఉత్ప్రేరకాల తయారీపై అవగాహన
బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణ
కొల్లిపర: ప్రకృతి వ్యవసాయం విధానాలు, జీవ ఉత్ప్రేరకాల తయారీపై బ్రెజిల్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం కోసం 25 మంది బ్రెజిల్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అత్తోట, దావులూరిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మనాయక్, బృందం సభ్యులకు బయో ఇన్పుట్‌ల తయారీ, ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఏడాదిపాటు పంటలతో భూమిని కప్పి ఉంచడంతో పాటు ఏ గ్రేడ్, ఏ ఫ్లస్ గ్రేడ్, ఏ ఫ్లస్ ప్లస్ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ వంటి మోడల్స్ అనుసరించడం వలన కలిగే అనేక రకాల ప్రయోజనాలను బృంద సభ్యులకు అవగాహన కల్పించారు. దేశీ ఆవు, ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆవు పేడ, మూత్రంలో అధికంగా లభించే సూక్ష్మ జీవులు, భూమి సారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పారు. బృందం సభ్యులను ఆవు దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పేడ, మూత్రం సూక్ష్మజీవుల ప్రాధాన్యంపై వివరించారు. అనంతరం స్వయంగా బృందం సభ్యులు బీజామృతం, ద్రవ, జీవామృతం, విత్తన గుళికల తయారీపై తర్ఫీదు ఇచ్చారు. దావులూరిపాలెంలో న్యూట్రి గార్డెన్, ఫుడ్ బాస్కెట్, ఆరోగ్యం, పోషకాహార కార్యకలాపాల లబ్ధిదారులను కలసి నిర్వహణ, ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు జాకీర్ హుస్సేన్, కృష్ణారావు, వాణిశ్రీ పాల్గొన్నారు.