
గంజాయి బ్యాచ్‌పై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
రెండుసార్లు దాడులు
నగరంపాలెం: గంజాయి మత్తులో ఊగుతూ వచ్చీపోయే వారిని చితకబాదే బ్యాచ్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు చట్టపరమైన పరిష్కారం నిర్దేశిత సమయంలోగా చూపాలని ఎస్పీ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కానివ్వ వద్దని సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పోలీస్‌స్టేషన్), బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు ట్రాఫిక్) కూడా అర్జీలు స్వీకరించారు.
సమోసాలు తయారు చేసి దుకాణాలకు వెళ్లి విక్రయించేవాళ్లం. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో ఇంటికి వస్తుండగా క్వారీ వద్ద గంజాయి బ్యాచ్ వారు నాపై దాడికి పాల్పడ్డారు. తప్పించుకుని నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశా. కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ నెల మూడో తేదీన సమోసాలు విక్రయించి వస్తుండగా మళ్లీ నాపై దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈసారి కూడా చర్యల్లేవు. ఒడిశా కార్మికులను కూడా బెదిరించి వారు దాడులకు పాల్పడుతున్నారు. నగదు, మొబైల్ ఫోన్లు లాగేసుకుంటున్నారు. గంజాయి బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
– గంజాయి బ్యాచ్ బాధితులు,
చండ్రరాజేశ్వరరావు నగర్