పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలు

Mar 14 2025 12:56 AM | Updated on Mar 14 2025 12:55 AM

కలెక్టర్‌ ఆదేశం

విద్యా శాఖ అధికారులతో సమీక్ష

రాజమహేంద్రవరం రూరల్‌: ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. క్షేత్ర స్థాయి విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆమె జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 25,723 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 22 పోలీసు స్టేషన్లలో ప్రశ్న, జవాబు పత్రాలు భద్రపరిచామన్నారు. ఇప్పటికే జిల్లాకు సెట్‌–1, సెట్‌–2 ప్రశ్న పత్రాలు చేరాయని తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ, జిల్లాలో ఆరు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని తెలిపారు. ఆ పాఠశాలలో అదనపు భద్రత ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్‌గా 24,763 మంది (బాలురు 12,791, బాలికలు 11,972), ప్రైవేటుగా 960 (బాలురు 591, బాలికలు 369) మంది హాజరు కానున్నారని వివరించారు. పరీక్షల నిర్వహణకు 11 వందల మంది ఇన్విజిలేటర్లు, 10 స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

పునర్వ్యవస్థీకరణకు 504 పాఠశాలల అంగీకారం

కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ, పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఇప్పటికే 570 పాఠశాలలను గుర్తించామన్నారు. వాటిలో 504 పాఠశాలలు అంగీకారం తెలిపాయని, 66 చోట్ల అంగీకారం తెలియజేయనందున ఆయా పాఠశాలల వారీగా అభ్యంతరాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. మరో 381 స్కూల్స్‌ పరిశీలన దశలో ఉన్నాయ న్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 22 వేల మంది బడి బయటి పిల్లలున్నారని, వేరొక స్కూలులో చదువుతూండటం, బదిలీపై వెళ్లడం తదితర కారణాలతో డ్రాపౌట్‌ కింద నమోదయ్యారని వివరించారు. వీరిలో 19 వేల విద్యార్థులను గుర్తించామ న్నారు. మిగిలిన విద్యార్తుల వివరాలను ఆయా పాఠశాలకు పంపించామని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన విధానంలో సంస్కరణలు రానున్నాయన్నారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ ఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌.సుభాషిణి పాల్గొన్నారు.

గృహ లబ్ధిదారులకు

అవగాహన కల్పించాలి

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలో అసంపూర్తిగా ఇళ్లు నిర్మించుకున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఈ అంశంపై జిల్లా, డివిజన్‌, మండల క్షేత్ర స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొదటి, రెండు దశల్లో రూ.15 వేల చొప్పున, మూడు, నాలుగు దశల్లో రూ.10 వేల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలన్నారు. దీనిపై ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాజా కుల ధ్రువీకరణ పత్రం నిర్ధారణ చేసుకుని మాత్రమే లబ్ధిదారులను గుర్తించాలన్నారు. దీనికి సంబంధించిన డిజిటల్‌ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పీడీ ఎస్‌.భాస్కరరెడ్డి, డ్వామా పీడీ ఎ.నాగమల్లేశ్వర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బీవీ గిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement