‘సూపర్‌’ సేవలేవి ? | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌’ సేవలేవి ?

Oct 7 2025 3:37 AM | Updated on Oct 7 2025 3:37 AM

‘సూపర

‘సూపర్‌’ సేవలేవి ?

ఏడు వందలకు పైగా ఓపీ

ఈ ఏడాదైనా మారేనా?

మూడేళ్ల క్రితం వైద్య కళాశాల మంజూరు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి బోధనాస్పత్రి హోదా అయినా.. ఏరియా ఆస్పత్రి స్థాయిని మించని వైద్యం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బోధనాస్పత్రికి పెద్ద సంఖ్యలో పేషెంట్లు వచ్చేలా మెడికల్‌ కాలేజీ వర్గాల నుంచి సరైన చొరవ లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆధునిక వైద్య సేవలు జిల్లా చెంతకు వచ్చినా దాని ప్రయోజనాలు సామాన్యులకు అందడం లేదు. ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను మూడు రకాలుగా విభజించారు. సాధారణ జ్వరం, దగ్గు, గాయాలు తదితర అనారోగ్య సమస్యల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తాయి. ఆపై స్థాయి వైద్య సేవలైన కళ్లు, దంత, కీళ్లు తదితర స్పెషాలిటీ వైద్య సేవల కోసం పట్టణాలు, నియోజకర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఇక వైద్య విభాగంలో అత్యున్నత సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే బాధ్యతను మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులు నిర్వహిస్తాయి. ఇక్కడ సాధారణ చికిత్సల నుంచి గుండె, కిడ్నీ, న్యూరో తదితర విభాగాల్లో ఆధునిక వైద్య సేవల వరకు అందించాల్సి ఉంటుంది. 2022 – 23 విద్యా సంవత్సరంలో జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరైంది. కొత్తగూడెంలోని ఏరియా ఆస్పత్రి, రామవరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌) బోధనాస్పత్రులుగా మారాయి. దీంతో జిల్లాలో ఉన్న ఏజెన్సీ వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్టే అనే భరోసా కలిగింది.

ఏరియా స్థాయిలోనే జీజీహెచ్‌..

మెడికల్‌ కాలేజీ వచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటికీ కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రి (గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రి – జీజీహెచ్‌)లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు కరువయ్యాయి. బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయి మూడేళ్లు దాటినా ఇప్పటికీ ఏరియా ఆస్పత్రి తరహాలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఆస్పత్రికి వస్తున్న ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) లెక్కలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు, బూర్గంపాడులో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. సీజన్‌లో ఇక్కడ సగటున ప్రతీ రోజు 700 వరకు ఓపీ ఉంటోంది. ఈ ఆస్పత్రుల కంటే ఎన్నో రెట్లు పెద్దదైన కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో కూడా రోజవారీ సగటు ఓపీ 700 వద్దే నమోదవుతోంది. రామవరంలోని ఎంసీహెచ్‌ ఓపీని కలిపితేనే ఈ సంఖ్య వెయ్యి దాటుతోంది. బోధనాస్పత్రిగా ఉన్నప్పటికీ జిల్లా ప్రజలు కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

కనిపించని చొరవ..

సాధారణంగా ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైన తర్వాత పేషెంట్ల వద్దకే ఆస్పత్రి వర్గాలు వెళ్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మారుమూల మండలాలు, గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తాయి. ఆధునిక వైద్య సేవలు ప్రభుత్వ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ప్రజలకు తెలియజేస్తాయి. ఫ్యామిలీ అడాప్షన్‌ ప్రోగ్సామ్స్‌ స్వీకరిస్తాయి. అంతేకాదు మలేరియా డే, కేన్సర్‌ డే వంటి దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాయి. ఇలాంటి చర్యల ద్వారా సాధారణ పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేస్తాయి. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో అక్కడ చదివే విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ అందుతుంది. కానీ కొత్తగూడెం మెడికల్‌ కాలేజీ, సర్వజన ఆస్పత్రి నుంచి ఈ తరహా చొరవ కరువైంది. కేవలం కమ్యూనిటీ హెల్త్‌ ప్రోగ్రామ్స్‌.. అవి కూడా జిల్లా కేంద్రం చుట్టు పక్కల ప్రదేశాలకే పరిమితమయ్యాయి.

ప్రస్తుతం సర్వజన ఆస్పత్రికి రోజువారీగా 700 పైగా ఓపీ ఉంటోంది. మాతాశిశు ఆస్పత్రితో కలిపితే ఈ సంఖ్య వెయ్యికి పైగానే ఉంటోంది. మెడికల్‌ కాలేజీ తరఫున క్యాంపులు నిర్వహిస్తున్నాం.

– రమేశ్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జీజీహెచ్‌

మెడికల్‌ కాలేజీ వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఆధునిక వైద్య సేవలను ఏజెన్సీ ప్రాంత గిరిజన ప్రజల చెంతకు తీసుకుపోయే విషయంలో దూకుడు కనిపించడం లేదు. ఇప్పటికే ఇక్కడ మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఉన్నారు. నాలుగో బ్యాచ్‌ వచ్చిన తర్వాత.. ఏడాదిలో హౌస్‌ సర్జన్లు (జూనియర్‌ డాక్టర్లు) కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తారు. అప్పటికై నా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లాకు చెందిన వైద్య ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అందుబాటులో ఉన్న ఏడాది కాలంలోనైనా ఈ ఆస్పత్రి ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌ విభాగంలో సేవలు మెరుగుపరచాలని జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

మెడికల్‌ కాలేజీ ఉన్నా.. క్యాంపులు సున్నా

‘సూపర్‌’ సేవలేవి ?1
1/1

‘సూపర్‌’ సేవలేవి ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement