
మెరుగైన చికిత్స అందించాలి
గిరిజన గ్రామాల అభివృద్ధి హర్షణీయం..
కేంద్ర ప్రభారి అధికారి
సాల్మన్ ఆరోగ్యరాజ్
ములకలపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి, కేంద్ర ప్రభారి అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ సూచించారు. ములకలపల్లి మండలంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌తో కలసి సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత మంగపేట పీహెచ్‌సీని సందర్శించి పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్నిరకాల జబ్బులకు వైద్యం అందించాలని, అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత మాధారంలో చెక్క బొమ్మల తయారీ యూనిట్‌ను సందర్శించాక కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. రాజుపేట, మూకమామిడి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌజుపిట్టల యూనిట్లను, వెదురు, మునగ తోటలను పరిశీలించారు.
అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): అన్ని ప్రభుత్వ శాఖ లు నిరంతర పర్యవేక్షణ, సమగ్ర సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభారి అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం ఆకాంక్షిత జిల్లా అయినందున ప్రతీ అభివృద్ధి సూచికపై సమగ్ర దృష్టి సారించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా కార్యాచరణ కొనసాగించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఔషధ మొక్కల పెంపకం, విద్యా ప్రమాణాల పెంపు వంటి తదితర అంశాలను తెలియజేశారు. తల్లీ పిల్లల ఆరోగ్యం, నూతన బ్లడ్ బ్యాంకుల స్థాపన, ఆధునిక వైద్య పరికరాల సమకూర్పు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, ఏఎంఓ నాగరాజశేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మురళి, సాయికృష్ణ, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజు, డీఎస్‌ఓ ప్రభాకరరావు, మహిళా శిశుసంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనినా, ఎల్‌బీఎం రాంరెడ్డి, ఉద్యాన శాఖాధికారి కిషోర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంఅర్బన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండడం శుభ పరిణామమని సాల్మన్ ఆరోగ్యరాజ్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాలు, మ్యూజియం తదితర ప్రాంతాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్‌కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఆదివాసీలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించడం అభినందనీయమన్నారు.