
గ్రూప్–2లో గిరిజన యువకుడి ప్రతిభ
చంద్రుగొండ: మండలంలోని తుంగారం పంచాయతీ టేకులబంజర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు గుగులోత్ రామకృష్ణ గ్రూప్–2 ఉద్యోగం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. రామకృష్ణ తల్లి లాలి రేషన్ డీలర్‌గా పనిచేస్తుండగా, తండ్రి కృష్ణ వ్యవసాయం చేస్తున్నాడు. రామకృష్ణ ఇంటర్ పూర్తయ్యాక అనారోగ్యానికి గురవడంతో చదువులు నిలిచిపోయాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాడు. పట్టుదలతో చదివి పది నెలల క్రితమే గ్రూప్–4లో ప్రభుత్వ కొలువు సాధించాడు. వారం రోజుల క్రితం వెల్లడించిన గ్రూప్–2 ఫలితాల్లో సెక్రటరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ అధికారి (ఏఎస్‌ఓ ) పోస్టుకు ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణను గ్రామస్తులు అభినందించారు.