
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేలగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. పూజలో పాల్గొన దలచిన భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
మేడారంలో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు
భద్రాచలంఅర్బన్: వనదేవతలు కొలువై ఉన్న మేడారంలోనూ భద్రాచలం తరహాలో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ జనరల్ వసంతరావు అన్నారు. భద్రాచలంలో ఐటీడీఏలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతరించి పోతున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఇలాంటి మ్యూజియాలు ఉపకరిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, ఏటూరునాగారం ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్, ఏఈ ప్రసాద్, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా మాస్‌లైన్
గుండాల: పేదల పక్షాన పోరాడుతూ, నిరంతరం ప్రజలకు అండగా ఉండే పార్టీ సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుండాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక జెడ్పీటీసీగా మూడుసార్లు ఎన్నికై న దివంగత నేత బాటన్న మండల అభివృద్ధికి కృషి చేశారని, రూ.కోట్లు ఇస్తామని ఆశ చూపినా అమ్ముడుపోకుడా పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే మాస్‌లైన్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. సమావేశంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు చండ్ర అరుణ, మాచర్ల సత్యం, బోస్, బిచ్చన్న, బొర్ర వెంకన్న, శంకరన్న, చంద్రన్న, పూనెం మంగయ్య, తెల్లం రాజు, జగన్, గణేష్, సనప కుమార్, రియాజ్, సింగన్న, పాపన్న పాల్గొన్నారు.

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య