అతివలదే అగ్రభాగం | - | Sakshi
Sakshi News home page

అతివలదే అగ్రభాగం

Oct 7 2025 3:37 AM | Updated on Oct 7 2025 3:37 AM

అతివలదే అగ్రభాగం

అతివలదే అగ్రభాగం

శాసించేదీ నారీమణులే..

‘స్థానిక’ రిజర్వేషన్లలో మహిళలకు ప్రాధాన్యం

సగానికి పైగా పదవులు వారికే..

జిల్లా ఓటర్లలోనూ మహిళలే ఎక్కువ

అప్పుడే వేడెక్కిన పల్లె రాజకీయాలు

చుంచుపల్లి : ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికే ఎక్కువ అవకాశాలు దక్కాయి. దీంతో పంచాయతీ, జిల్లా, మండల పరిషత్‌లలో అతివల ప్రాతినిధ్యం పెరగనుంది. సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సగం మహిళలకే రిజర్వ్‌ చేశారు. ఇక అభ్యర్థుల గెలుపోటములనూ వారే నిర్ణయించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల్లో సగం అతివలకే రిజర్వ్‌ కాగా గ్రామ పంచాయతీ, వార్డు స్థానాల్లోనూ మహిళలకే ప్రాధాన్యం దక్కింది. అయితే బేసి సంఖ్య ఉన్నచోట మాత్రం వారు ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు రాజకీయ అనుభవం లేకున్నా.. రిజర్వేషన్లు అనుకూలించినందున కుటుంబంలోని మహిళలను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయంతో పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రామాల్లో మొదలైన సందడి..

స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా దీనికి అనుగుణంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్న పలువురికి రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదు. మరి కొందరికి అనుకూలించడంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. అయితే ఈనెల 8న హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ తర్వాత రాజకీయం మరింతగా వేడెక్కనుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువడితే ఈ నెల 23, 27 తేదీల్లో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 471 గ్రామ పంచాయతీలకు ఈ నెల 31, నవంబర్‌ 4, 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బీ–ఫారంపై పోటీ చేయాల్సి ఉండటంతో పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. పోటీకి దిగే ఆలోచనలో ఉన్నవారు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సర్పంచ్‌ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు.

జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో ఎన్నికలేవైనా శాసించేది వారే. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 471 పంచాయతీలు, 22 మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఇటీవల ఓటర్ల జాబితాలను ప్రదర్శించి మొత్తం 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది ఉన్నారు. ఇతరులు మరో 24 మంది ఉన్నారు. అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. దీంతో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement