
28 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
బాల్యంలో మందలించడంతో
ఇల్లు వదిలి వెళ్లిన కుమారుడు
టేకులపల్లి: తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. 28 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరిన ఘటన టేకులపల్లి మండలం మంగళితండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లాకావత్ పంతులు–నాతి దంపతుల రెండో కుమారుడు హరి.. 1997లో కిన్నెరసాని గురుకుల పాఠశాలలో ఆరో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు. హరి బీడీలు తాగుతున్నాడని తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో భయాందోళనకు గురై తల్లి దాచుకున్న డబ్బు తీసుకుని ఇంటినుంచి పారిపోయాడు. కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం హోటళ్లలో కొంత కాలం పని చేశాడు. ఖమ్మంలో పని చేస్తుండగా ఒకరోజు తండ్రి, మరుసటి రోజు సోదరి మామ కనిపించగా భయపడి కోదాడ చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం పని చేశాక హైదరాబాద్ అమీర్‌పేటలో ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పని చేశాడు. ఈ క్రమంలో బేగంపేటలో అద్దె ఇంట్లో ఉంటూ 2010లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఒక పాప, బాబు ఉండగా.. తల్లిదండ్రులపై ప్రేమానుబంధం పెరిగి వారిని కలిసేందుకు రెండు రోజుల క్రితం మంగళితండాకు వచ్చాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులను కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నాడు.
నకిలీ కొడుకు విఫల యత్నం
లాకావంత్ పంతులు కుమారుడు హరి బాల్యంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్న ఓ సాధువు పదేళ్ల కిత్రం తానే హరినంటూ పంతులు ఇంటికి వచ్చాడు. అయితే కుమారుడి పోలికలు లేకపోయినా.. ఇనాళ్లు ఎదురుచూసిన తల్లిదండ్రులు అతడి మాటలు నమ్మి ఇంట్లోకి రానిచ్చారు. రెండు రోజుల తర్వాత అతడు హరి కాదని, నకిలీ అవతారం ఎత్తి వచ్చాడని కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో అతడు శ్రీశైలంలో పని ఉందంటూ చెప్పి వెళ్లిపోయాడు.