
ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు
దసరా పండుగ ముగియడంతో
తిరుగుముఖం
ఇల్లెందులో తగిన సంఖ్యలో లేని
బస్సులు
ఇల్లెందు: దసరా పండుగ అనంతరం తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో ఇల్లెందు బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఆదివారం బస్టాండ్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కనిపించింది. తగిన సంఖ్యలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పాలయ్యారు. పండుగతోపాటు గుండాలలో నాలుగు రోజులపాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా స్వగ్రామానికి చేరుకున్నారు. దసరాకు వచ్చినవారు, అమ్మవారి వేడుకలకు వచ్చినవారు తిరిగి వెళ్తుండటంతో బస్టాండ్ ప్రయాణికులతో కిక్కరిసింది. ఇల్లెందు నుంచి గుండాల, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలకు సరిపడా బస్సులు లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, మణుగూరు, గోదావరిఖని, వేములవాడ, భూపాలపల్లి, హనుమకొండ, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే బస్సులు చాలా ఆలస్యంగా వచ్చాయని తెలిపారు. దీంతో కొందరు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. కాగా పండగలు వస్తే కనీసం భోజనం చేసే తీరిక కూడా ఉండటం లేదని డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు. బస్టాండ్లలో నిలిపిన బస్సుల్లోనే భోజనాలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికుల ఇక్కట్లపై డిపో అసిస్టెంట్ మేనేజర్ సునీతను వివరణ కోరగా.. డిపోలో ఒక్క బస్సు కూడా ఉండటం లేదని, అన్ని బస్సులు రూట్లలోనే తిరుగుతున్నాయని తెలిపారు.