
ఏటీఎంలో చోరీ యత్నం
పోలీసుల రాకతో దుండగుడు పరార్
ములకలపల్లి: ములకలపల్లిలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. పోలీసులు కథనం ప్రకా రం.. శనివారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఏటీఎంలో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు కారు దిగుతుండగా, ఏటీఎంలో ఉన్న దుండగుడు గమనించి పరారయ్యాడు. నగదు కోసం ఏటీఎంను పగులగొడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఏటీఎం తెరచుకోకపోవడంతో నగదు చోరీకి గురికాలేదు. నిందితుడు లేతపచ్చరంగు పాలిథీన్ కవర్ ధరించి ఉన్నాడు. కొత్తగూడెం క్లూస్‌టీం సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘటనా ప్రదేశాన్ని సందిర్శించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఎస్‌బీహెచ్ మేనేజర్ పుల్లారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఇల్లెందు: మండలంలోని కరెంటాఫీసు వద్ద శనివారం రాత్రి పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని జగదాంబ సెంటర్‌కు చెందిన కిరాణా వ్యాపారి అన్నవరపు వెంకటేశ్వర్లు 35 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు, 60 అంబర్ ప్యాకెట్లు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ గని తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
దాడి ఘటనలో కేసు నమోదు
ఇల్లెందు: దాడి ఘటనలో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన ముసలయ్య, అతని కుమారుడు కలిసి తనతోపాటు తన కుటుంబ సభ్యులను అకారణంగా దూషించి, దాడి చేశారని మల్లిపెద్ది కమలాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
మణుగూరు టౌన్: మండలంలోని పగిడేరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం రాత్రి పేరంటాల చెరువులో గల్లంతు కాగా, ఆదివారం మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మల్లూరుకు చెందిన గోడ చరణ్(28) తన అత్తగారి ఇంటి వద్ద పగిడేరులో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇద్దరు మిత్రులతో కలిసి సమీపంలోని పేరంటాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. వల వేస్తున్న క్రమంలో చరణ్ గల్లంతయ్యాడు. అతనితో వెళ్లిన మిత్రులు కుటుంబసభ్యులకు తెలపగా, రాత్రివేళ గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా, చరణ్ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.