
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిర పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఏపీలోని ఎన్టీఆర్‌జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడుకు చెందిన ఇలవరపు వంశీ (21) తన స్నేహితులతో కలిసి ఆది వారం మధిర పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. పూర్తిస్థాయిలో ఈతరాని ఆయన వంశీ ప్యాంట్‌తో పాటే చెరువులోకి దిగాక కాసేపటికి ఆయాసంతో ఒడ్డుకు చేరలేకపోయాడు. ఈ సమయాన నీటిలో మునుగుతున్న ఆయనను కాపాడేందుకు స్నేహితులు యత్నించినా ఫలితం కానరాలేదు. సమాచారం అందుకున్న స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు నాలుగుగంటల పాటు శ్రమించి అతని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, గాలింపు కొనసాగినంత సేపు వంశీ ప్రాణాలతో బయటకు వస్తాడని ఎదురుచూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఆయన సంజీవరావు – మరియమ్మ దంపతుల్లో నలుగురి సంతానంలో వంశీ ఒక్కడే కుమారుడు కాగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుతున్న ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.