
ఆశలు ఆవరి
1.80 లక్షల ఎకరాల్లో సాగు
నిలువునా ఎండుతుండగా అన్నదాతల్లో ఆందోళన
ఎన్ని మందులు చల్లినా కనిపించని ఫలితం
మూడుసార్లు మందులు కొట్టా..
వాతావరణ పరిస్థితులే కారణం
బూర్గంపాడు: పొట్టదశలో ఉన్న వరి పైరు తెగుళ్లతో నిలువునా ఎండిపోతోంది. పంట చేతికొచ్చే సమయంలో ఎండాకు తెగుళ్లు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడల నివారణకు ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. తెగుళ్ల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండడం రైతులను మరింతగా కలవరపెడుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు పురుగుమందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు.
బోనస్ వస్తుందనే ఆశతో..
సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో రైతులు సన్నరకం వరి సాగుకే మొగ్గుచూపారు. అయితే సన్నరకం వరికి చీడపీడలు, దోమ, పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. దొడ్డు రకం వరిసాగుకు, సన్నరకం వరి సాగుకు మధ్య ఎకరాకు రూ.5వేల వరకు పెట్టుబడుల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించటంతో రైతులు ఆ ఆశతో సన్నరకం వరిసాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో మూడొంతుల మేర రైతులు సన్నరకం వరినే సాగు చేశారు.
వివిధ దశల్లో పంట
జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం వరిపైరు పొట్ట, చిరు పొట్ట, కంకి వచ్చే దశలో, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో అగ్గితెగులు, తాటాకు తెగులు, ఎండాకు తెగులు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వరి ఆకుల్లోని పత్రహరితం మొత్తం మాడిపోయి పైరు నిలువునా ఎండిపోతోంది. ముదురు, లేత అదునులలో సాగు చేసిన వరిపైరు మొత్తానికి కూడా తెగుళ్లు ఆశిస్తున్నాయి. తెగుళ్ల నివారణకు రైతులు ఇప్పటికే మూడు, నాలుగుసార్లు మందులు పిచికారీ చేశారు. అయినా పెద్దగా మార్పు రాలేదని నిరాశకు గురవుతున్నారు. పంట దిగుబడిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు తగు సలహాలు, సూచనలు అందించాలని కోరుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.80 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో పంట ఏపుగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇటీవలి వరకు ఆశాజనకంగానే ఉండగా.. గత పదిహేను రోజుల నుంచి వరిపైరు చివరి కొనలు ఎండిపోతున్నాయి. ఆకుల చివరి నుంచి ఎండు కుంటు వస్తోంది. తొలుత కొద్దిగానే కనిపించిన తెగుళ్లు రోజుల వ్యవధిలోనే పొలం మొత్తం విస్తరిస్తోంది. అధిక వర్షాల కారణంగానే ఈ తెగుళ్ల ఉధృతి పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు రసాయనిక మందులు పిచికారీ చేసినా పెద్దగా మార్పేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి పైరును ఆశించిన ఎండాకు తెగులు
వరి పొట్టకు వచ్చేటప్పుడు ఎండాకు తెగులు బాగా పెరిగిపోతోంది. ఈ తెగులు కనిపించిన వెంటనే మందులు కొట్టినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దిగుబడి తగ్గిపోతుందని భయంగా ఉంది. పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది.
– మారం శ్రీనివాసరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం
వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో తెగుళ్ల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత వాతావరణం తెగుళ్లకు అనుకూలంగా ఉంది. నివారణకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్, ప్లాంటమైసిన్, నాటివో వంటి ఫంగసైడ్స్ పిచికారీ చేసుకోవాలి. తెగుళ్లు వచ్చిన పైరు క్రమేపీ కోలుకుంటుంది. తెగుళ్లు రాని పైరుకు కూడా ముందస్తుగా మందులు పనిచేస్తాయి.
– శంకర్, మండల వ్యవసాయశాఖ అధికారి, బూర్గంపాడు