అందరి చూపూ.. ఆ రెండింటి వైపే | - | Sakshi
Sakshi News home page

అందరి చూపూ.. ఆ రెండింటి వైపే

Oct 6 2025 2:16 AM | Updated on Oct 6 2025 2:16 AM

అందరి చూపూ.. ఆ రెండింటి వైపే

అందరి చూపూ.. ఆ రెండింటి వైపే

● దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌ ● ఇక్కడ గెలిస్తే జెడ్పీ చైర్మన్‌ బరిలో అవకాశం ● జిల్లా వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిన సీట్లు ● జనరల్‌కు కేటాయింపుపై ఆదివాసీ సంఘాల ఆగ్రహం

చర్ల అభ్యర్థులు దాదాపు ఖరారు ?

● దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌ ● ఇక్కడ గెలిస్తే జెడ్పీ చైర్మన్‌ బరిలో అవకాశం ● జిల్లా వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిన సీట్లు ● జనరల్‌కు కేటాయింపుపై ఆదివాసీ సంఘాల ఆగ్రహం

భద్రాచలం : స్థానిక సంస్థల ఎన్నికల వేళ దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ సీట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎప్పటి నుంచో ఎస్టీలకు రిజర్వ్‌డ్‌గా ఉన్న ఈ స్థానాలను ఈసారి జనరల్‌కు కేటాయించారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి సైతం జనరల్‌కు దక్కడంతో హేమాహేమీల దృష్టి దుమ్ముగూడెం, గుండాల వైపు మళ్లింది. జిల్లాలోని పలువురు సీనియర్‌ నాయకులు ఈ రెండు చోట్లా పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌ కేటగిరీకి కేటాయించడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చైర్మన్‌ పీఠానికి చాన్స్‌..

జిల్లాలోని గుండాల, దుమ్ముగూడెం జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌, ఆళ్లపల్లి, టేకులపల్లి జనరల్‌ మహిళలకు కేటాయించారు. జెడ్పీ చైర్మన్‌ సీటు సైతం జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, జెడ్పీ సీటు ఆశిస్తున్న వారంతా దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు. తమకున్న రాజకీయ, ఆర్థిక బలాబలాలు, ఓట్ల శాతం ఇతర అంశాలపై స్థానిక నాయకులతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి అశ్వాపురానికి చెందిన తూళ్లూరి బ్రహ్మయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఓట్ల సమీకరణల ప్రకారం ఆయన మొదటి ప్రాధాన్యత గుండాలకు, ఆ తర్వాత దుమ్ముగూడెం వైపు పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. దుమ్ముగూడెం నుంచి టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్‌ సైతం ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. వీరితో పాటు లక్ష్మీపురానికి చెందిన పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తెల్లం సీతమ్మతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా దుమ్ముగూడెం సీటు సీపీఐకి వస్తే స్థానికుడైన రావులపల్లి రవికుమార్‌కు దక్కే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ తరఫున రావులపల్లి రాంప్రసాద్‌ పేరు వినిపించినా.. ఆయనకు నియోజకవర్గ స్థాయి నాయకత్వ బాధ్యతలు ఉండడంతో సాగి శ్రీనివాసరాజును ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. గుండాల జెడ్పీటీసీ రేసులో తూళ్లూరి బ్రహ్మయ్య కానట్టయితే టేకులపల్లికి చెందిన ఏలూరి కోటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. మరో స్థానిక నాయకుడు ఎస్‌కే ఖదీర్‌ సైతం టికెట్‌ ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున పినపాకకు చెందిన భవానీ శంకర్‌, మోకాళ్ల వీరస్వామి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

టేకులపల్లి, ఆళ్లపల్లి జనరల్‌ మహిళలు..

టేకులపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించగా.. ఇక్కడ పోటీ తీవ్రంగానే ఉంది. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గోనెల విజయలక్ష్మి మరిది కూతురు బండ్ల రజని, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడి సతీమణి కోరం ఉమ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా, వీరితో పాటు గుండాల సుచరిత, ఆకారాపు స్వప్న, భూక్యా చంద్రకళ, భూక్యా గంగ తదితర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఆళ్లపల్లి జెడ్పీటీసీ సైతం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేయగా కాంగ్రెస్‌ తరఫున బుర్రా వినోద పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున ఎస్‌డీ షమీన్‌, మంజుభార్గవి, బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామినేని శ్రీలత పేర్లు వినిపిస్తున్నాయి.

చర్ల జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో భద్రాచలం డివిజన్‌ సీనియర్‌ నాయకులు, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్‌ను కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. దుర్గాప్రసాద్‌ కాని పక్షంలో బండారు రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. బీఆర్‌ఎస్‌ తరఫున పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఈర్ణి కృష్ణమోహన్‌ పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఇక సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement