
ఉద్యమ గుమ్మం నుంచే రణనినాదం
● చరిత్రలో నిలిచిపోయేలా సీపీఐ శత వసంతాల ముగింపు సభ ● ఆహ్వాన సంఘం సన్నాహ క సమావేశంలో వక్తలు ● హాజరైన కె.నారాయణ, పువ్వాడ, కూనంనేని
ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమ గుమ్మమైన ఖమ్మం నుంచే రణనినాదం మోగించడమే కాక పునరుత్తేజంతో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి జరగాలని సీపీఐ జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు లేని వ్యవస్థ మనజాలకపోగా, రానున్న కాలం కమ్యూనిస్టులదే అయినందున విస్తరణకు పునరంకితం కావడమే అందరి కర్తవ్యమని అన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్న నేపథ్యాన ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఖమ్మానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆంధ్ర మహాసభ ద్వారా నైజాం పతనానికి నాంది పలికిన ఇక్కడ శత వసంత వేడుకల ముగింపు సభ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బహు పోరాటాలకు వేదికగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు పునరంకితమవుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఛండీఘర్ మహాసభ ఇదే పిలుపునిచ్చిందని నారాయణ గుర్తుచేశారు. కాగా, స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఆ తర్వాత సామాజిక చైతన్యం కోసం జరిగిన ఏ పోరాటంతో సంబంధం లేని దేశద్రోహులు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మావోయిస్టులను తుదముట్టిస్తామని చెబుతుండగా.. మావోయిస్టులు అంతమైనా ఆ సిద్ధాంతం అంతం కాదని తేల్చిచెప్పారు. దేశాన్ని ముక్కలు కానివ్వమనే నినాదంతో పాటు గ్రామగ్రామాన కమ్యూనిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా శత వసంత సభ నిర్వహిస్తామని నారాయణ తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ది అధికార కాంక్ష..
ఆర్‌ఎస్‌ఎస్‌ది అధికార కాంక్ష మాత్రమే కాక విభజన, విధ్వంసం మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు సైద్ధాంతిక నిర్మాణంతో రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బలహీనపడినా పునరుత్తేజం తథ్యమని తెలిపారు. కొందరు అలవికాని హామీలు, ధన ప్రభావం ఇతరత్రా కారణాలతో ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులే దేశానికి రక్ష, రాజకీయ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన కూనంనేని మాట్లాడుతూ త్యాగాల చరిత్రతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతుంటే.. స్వార్థ చింతన, అధికార లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందని అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు టీఎం.మూర్తి, పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, అక్కినేని వనజ, ముప్పాల నాగేశ్వరరావు, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, దండి సురేష్, ఎస్.కే.సాబీర్‌పాషా, నగర ప్రముఖులు ఎంఎఫ్.గోపీనాథ్, డాక్టర్ పి.గోర్కి, డాక్టర్ వై.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.