
పట్టించుకోకుంటే సత్తా చూపిస్తా
ట్రైకార్ మాజీ చైర్మన్
తాటి వెంకటేశ్వర్లు
అశ్వారావుపేట : జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తన సొంత ట్రస్టులా భావిస్తున్నారని.. పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే తన సత్తా చూపిస్తానని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, పలు పార్టీల్లో క్రమశిక్షణగా పని చేశానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పార్టీని స్థాపించారని, కానీ జిల్లా పార్టీ పదవుల్లో ఉన్న వారు మూలాలను విడిచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో తాను బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినా.. తనకు జరిగిన అవమానం తెలుసుకుని హరీష్‌రావు, కేటీఆర్ పిలిచి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడలు మానుకోకుంటే తిరుగుబాటు తప్పదని అన్నారు. పార్టీ కేడర్‌కు తెలియజేయకుండా సమావేశాలు నిర్వహించడం సబబు కాదన్నారు. రేగా కాంతారావు అశ్వారావుపేటలో మీటింగ్ పెడితే తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. గతేడాది పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగితే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాధిత రైతులను పరామర్శించామని, పార్టీ పెద్దలను కూడా రావాలని కోరగా వారిని రానీయకుండా ఇన్‌చార్జ్ లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా కేడర్‌ను కలుపుకుని సమన్వయంతో నడవాలని సూచించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యులు అంకత మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్‌లు పొట్టా రాజులు, కారం ఎర్రయ్య, నల్లపు రామారావు తదితరులు ఉన్నారు.