
చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం
● ముగిసిన టెండర్ల ప్రక్రియ ● ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుమతి
పాల్వంచరూరల్ : చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. చేప పిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ శనివారం పూర్తి కాగా, జిల్లాలో నిర్దేశించిన జలవనరులకు సరఫరా చేసేందుకు ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుమతి లభించింది. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సమక్షంలో ఈ మేరకు ఖారారైనట్లు మత్స్యశాఖ అధికారి ఎండీ.ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించిన అనుమతి కోసం మత్స్యశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతి రాగానే నిర్దేశించిన చెరువులు, కుంటల్లో చేప పిల్ల లు వదులుతామని పేర్కొన్నారు.
జిల్లాలో 1.76 కోట్ల పిల్లలు..
జిల్లాలో 734 చెరువులు ఉండగా, ఈ ఏడాది సమయం లేనందున 600 చెరువుల్లో చేప పిల్లలను పోయనున్నట్లు మత్స్యశాఖాధికారి తెలిపారు. ఇందులో చెరువుల్లో నీటి సామర్థ్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద సైజు పిల్లలను పంపిణీ చేయనున్నారు. 80 నుంచి 100 మి.మీ.సైజులో 86 లక్షల పిల్లలకు ఒక్కో పిల్లకు రూ.1.49 పైసల చొప్పున, 35 – 40 మి.మీ. సైజ్ 90 లక్షల పిల్లలకు 56 పైసల చొప్పున పంపిణీ చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. ఫైనల్ టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇద్దరు కాంట్రాక్టర్ల ద్వారా చేపపిల్లల సరఫరాకు మత్స్యశాఖ కమిషనర్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే జిల్లాలోని నిర్దేశించిన చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.