
చేరువగా ‘కేంద్రీయ’ విద్య
నిర్మాణానికి స్థల పరిశీలన..
జిల్లాకు విద్యాలయను మంజూరు చేసిన కేంద్రం
● విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ బోధన అందుబాటులోకి.. ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
కొత్తగూడెం అర్బన్: కేంద్రీయ విద్యాలయ మంజూరుతో జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్‌లో లేవనెత్తడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విద్యాలయ మంజూరైంది. కొత్తగా నాలుగు విద్యాలయాలు మంజూరు కాగా, అందులో ఒకటి జిల్లాకు కేటాయించారు. కేంద్రీయ విద్యాలయలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు కూడా విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించి విద్యను అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయ మంజూరు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన జరుగనుంది.
నామినల్ ఫీజులతో ప్రవేశాలు
కేంద్రీయ విద్యాలయలో ఆన్‌లైన్ పద్ధతిలో నామినల్ ఫీజులతో అడ్మిషన్లు నిర్వహిస్తారు. సీబీఎస్‌ఈ విద్య కోసం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో రూ. లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండదు. జిల్లాలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఆ స్కూళ్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ కూడా రావడంతో జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది.
కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు రామవరం, లక్ష్మీదేవిపల్లి మండలం పాలకేంద్రంలోని రెండు ఎకరాల స్థలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఏ స్థలాన్ని కూడా ఖరారు చేయకపోవడంతో మరోసారి స్థల పరిశీలన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకేంద్రంలోని స్థలం విద్యాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అప్పటివరకూ కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్‌లో విద్యాలయకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అనుమతులు ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా భవనాల నిర్మాణం పూర్తయితే నూతన భవనంలోనే విద్యాలయను కొనసాగించనున్నారు. లేకపోతే తెలంగాణ స్కూల్‌లో క్లాసులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, పర్యవేక్షణ, నిధులు మంజూరు తదితర కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి.