
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద కాలనీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కరటూరి కిషోర్(38) శనివారం పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దసరా పండుగకు అత్త వారింటికి వెళ్లగా, అక్కడి గొడవ జరగడంతో కిషోర్‌ను కొట్టారని, తిరిగి ఇంటికి వచ్చాక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. సీఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేటీపీఎస్ ఆర్టిజన్..
పాల్వంచ: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగిన కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నవభారత్ గాంధీనగర్‌కు చెందిన శాంపూరి ప్రవీణ్‌కుమార్ (45) కేటీపీఎస్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 3న పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో ..
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం సారధినగర్‌లో నివాసముండే మాదాసు సాయితేజ(19) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా... పిల్లలను తల్లి వదిలివేసి వెళ్లింది. దీంతో సాయితేజ సోదరి పెళ్లిని బంధువులు జరిపించారు. అయితే, ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి తిరిగి రావడం, మద్యం మత్తులో సాయి గొడవ పడుతుండడంతో అందరూ వెళ్లిపోయారు. ఆపై పెద్దమ్మ కవిత ఇంటి వద్ద ఉంటున్న సాయితేజ శనివారం రాత్రి అమ్మవారి శోభయాత్ర ముగిశాక తమ సొంతింటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఆదివారం ఆయన పెద్దమ్మ ఈ విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.
పాముకాటుతో మహిళ మృతి
నేలకొండపల్లి: ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన జె.రాధ నేలకొండపల్లి మండలం అనాసాగారంలో ఆదివారం కూలికి వచ్చింది. చేలో పత్తి తీస్తుండగా పాము కాటేయడంతో మిగతా కూలీలు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.