
రైతులకు ‘పూల’బాట !
పూల సాగుతో లాభాలు
వరుస నష్టాలతో
వాణిజ్య పంటలకు స్వస్తి
లాభసాటిగా ఉంది
ఖమ్మం, విజయవాడలో విక్రయం
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో రైతులు వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపారు. గత పది సంవత్సరాలుగా మిరప, పత్తి పంటలు సాగు చేసి నష్టపోగా, వారు ఉద్యాన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన పంటల సాగులో అంతర పంటలను వేసి ఏడాదికి మూడు సార్లు పంటల సాగు చేసి దిగుబడులు తీస్తున్నారు.
వందల ఎకరాల్లో సాగు
బంతి, చామంతి, గులాబి పంటలను వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రదానంగా పండుగ సీజన్లో బంతి, చామంతి, కనకాంబరాలు సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వినాయక చవితి, బతుకమ్మ సీజన్లతో పాటు కార్తీక మాసాల్లో జరిపే శుభకార్యాలల్లో పూలకు మంచి గిరాకీ ఉంది. బంతి కేజీ రూ. 70 నుంచి 100 వరకు అమ్ముతున్నారు. చామంతి పూలు కేజీ రూ. 500, కనకాంబరాలు రూ. 4000, గులాబీలు కేజీ రూ. 500 వరకు ధర పలుకుతోంది. పూల సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. పూలను అమ్మగా రూ.3 లక్షల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. పండగ సీజన్ల తరువాత పూలను ఖమ్మం, విజయవాడ మార్కెట్లకు తరలిస్తున్నారు.
పూలసాగు లాభసాటిగా ఉంది. గతంలో మిరప పంట వేసి తీవ్రంగా నష్టపోయాను. మూడు ఎకరాల్లో బంతి పూల సాగు చేపట్టాను. పండుగ సీజన్లో పూలు చేతికందేలా పంటను సాగు చేశాను. దింతో గిట్టుబాటు ధర లబిస్తోంది.
– బొడ్డుపల్లి నర్సింహారావు, ముష్టికుంట్ల
ఐదెకరాల్లో బంతి, చామంతి, గులాబీ పూల సాగు చేశాను. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లబిస్తుండటంతో క్రమంగా పూలను ఖమ్మం, విజయవాడకు సులభతరంగా మార్కెటింగ్ చేస్తున్నా. మంచి ఆదాయం వస్తోంది.
– బొడ్డుపల్లి మల్లికార్జున్‌రావు, ముష్టికుంట్ల

రైతులకు ‘పూల’బాట !

రైతులకు ‘పూల’బాట !

రైతులకు ‘పూల’బాట !