
కొనసాగుతున్న నిమజ్జనం
భద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి తీరంలోని ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌కు వరుసగా మూడో రోజు శనివారం భారీగా దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి తరలిచ్చాయి. శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు చేసిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి ప్రతిమలను నిమజ్జనానికి తీసుకొచ్చారు. విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో వాహనాల నుంచి దించి లాంచీల ద్వారా గజ ఈతగాళ్లు నదిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులను నిమజ్జన ఘాట్ వద్దకు అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ముగ్గురిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, ఆడబిడ్డలపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం కాలనీకి చెందిన భూక్యా వాణిశ్రీకి సుజాతనగర్ మండలం సర్వారానికి చెందిన, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నరేంద్రతో 2023లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా భర్త, అత్త, ఆడబిడ్డ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
కానిస్టేబుల్‌తో గొడవ పడిన వ్యక్తిపై..
పాల్వంచరూరల్: కానిస్టేబుల్‌తో గొడవ పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద శుక్రవారం రాత్రి గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సత్యం సంఘటనా స్థలానికి వెళ్లాడు. గొడవను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా జగన్నాథపురానికి చెందిన అడపా నాగేంద్రబాబు అనే వ్యక్తి కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ప్రమాద ఘటనపై..
భద్రాచలంఅర్బన్: రోడ్డు ప్రమాద ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్ వద్ద గత నెల 28న ద్విచక్రవాహనం ఢీకొని రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, ప్రమాదానికి కారణమైన గోపిచంద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాలలో
వంట పాత్రలు చోరీ
జూలూరుపాడు: జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట పాత్రలను చోరీ చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలను శనివారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు సిద్ధమవుతుండగా కొన్ని వంట పాత్రలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హెచ్‌ఎం లక్ష్మీనరసయ్య తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
భద్రాచలంఅర్బన్: అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను శనివారం భద్రాచలం పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని కొల్లుగూడెం వద్ద గోదావరి నుంచి ఇసుక నింపుకుని వస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు.
రెండు మట్టి లారీలు సీజ్
ములకలపల్లి: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. మాధారం ఎఫ్‌ఎస్‌ఓ హరిప్రసాద్ కథనం ప్రకారం.. అటవీ సిబ్బంది శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా గస్తీ చేపట్టారు. ఈ క్రమంలో మండల పరిధిలోని పూసుగూడెం అటవీ ప్రాంతం నుంచి లారీల్లో అక్రమంగా మట్టి తరలిస్తుండగా ఆపి పరిశీలించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకుని, పాల్వంచ రేంజ్ డిపోకు తరలించారు. కాగా సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టిని ములకలపల్లి, పాల్వంచ మండలాల సరిహద్దులోని ఓ ప్రదేశంలో భారీగా డంప్ చేసి, విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అక్రమ తోలకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

కొనసాగుతున్న నిమజ్జనం