
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన చాపరాలపల్లి శివారులో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని విస్సన్నపేట మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన బత్తుల కిరణ్, చింతపల్లి వాసి సురేష్ ద్విచక్ర వాహనంపై ములకలపల్లి మీదుగా అన్నపురెడ్డిపల్లి వెళుతున్నారు. అదే సమయంలో అన్నపురెడ్డిపల్లి నుంచి ట్రాలీ వాహనం వస్తోంది. ఈ క్రమంలో చాపరాలపల్లి మూలమలుపు వద్ద బైక్, ట్రాలీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కిరణ్ కాలు విరిగగా, సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎస్. మధుప్రసాద్ తెలిపారు.
పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలు
జూలూరుపాడు: పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాంపురం తండాలో శనివారం జరిగింది. తండాకు చెందిన కొర్ర కవిత, ఆమె పదేళ్ల కుమారుడు సంతోష్, తోడి కోడలు జానులు పత్తి చేలోకి కోతులు రాకుండా కాపలా వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. పిడుగుపడటంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాధితులను ట్రాక్టర్ సాయంతో వాగు దాటించి, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి మృతదేహం లభ్యం
సుజాతనగర్: బహిర్భూమికి వెళ్లి సాగర్ కాల్వలో పడి గల్లంతైన విద్యార్థి లోహిత్ హర్ష(15) మృతదేహం ఏన్కూరు పోలీసులకు శనివారం ఉదయం లభ్యమైంది. సుజాతనగర్‌కు చెందిన బొమ్మనబోయిన లోహిత్ హర్ష శుక్రవారం సాయంత్రం ఏన్కూరు మండలం రాజలింగాలకు సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన విషయం విదితమే. దీంతో ఏన్కూరు పోలీసులు, రెస్క్యూ టీం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమయింది. మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతనగర్‌లో మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు