
ఇద్దరు మద్దతిస్తే..
తక్కువ ఎంపీటీసీ స్థానాలున్న
మండలాలు
అక్కడ ఎంపీపీగా గెలవొచ్చు
● నాలుగు మండలాల్లో ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ● ఏడింటిలో పదిలోపే ఎంపీటీసీలు ● తక్కువ స్థానాలు ఉన్నచోట మండల పరిషత్ పోరు రసవత్తరం
చుంచుపల్లి: అతి తక్కువ ఎంపీటీసీ స్థానాలున్న మండలాల్లో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. అక్కడ ఎంపీపీ కావాలంటే గెలిచిన అభ్యర్థికి ఇద్దరు మద్దతిస్తే సరిపోతుంది. జిల్లా విభజన తర్వాత కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష పదవి విషయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే ప్రధాన పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మండలాలు చిన్నవి కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. దీంతో పలుచోట్ల ఇద్దరు, ముగ్గురు మద్దతిచ్చినా ఎంపీపీ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతటా ఇదే చర్చే జరుగుతోంది. జిల్లాలోని 22 మండలాల్లో పది లోపు ఎంపీటీసీ స్థానాలున్న మండలాలు ఏడు ఉన్నాయి. ముఖ్యంగా ఆళ్లపల్లి, కరకగూడెం, గుండాల, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మండల పరిషత్ కార్యవర్గానికి ఐదారుగురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈ మండలాల్లో జరిగే సమావేశాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను మినహాయిస్తే ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. మరికొన్ని చోట్ల నలుగురు, ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండనున్నారు. ఈ మండలాల్లో కో – ఆప్షన్ ఎన్నిక జరిగితే ఒకరిద్దరు సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేతులెత్తి ఎన్నుకునే ఎంపీపీ పదవికి అక్కడ సభ్యుల మద్దతు కీలకంగా మారనుండగా అక్కడ గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
స్థానాల వివరాలిలా..
●ఆళ్లపల్లి మండలం గుండాల నుంచి విడిపోగా, 2019లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఐదుకు పెరిగాయి. ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయిచగా ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. ఎంపీపీ పదవి కావాలనుకునే సభ్యుడికి మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతు అవసరం.
●పినపాక నుంచి విడిపోయిన కరకగూడెం మండలంలో మొదట నాలుగు ఎంపీటీసీ స్థానాలుండగా ఈసారి ఒకటి పెరిగింది. జెడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ కూడా ఎంపీపీ పదవి పొందాలనుకునే సభ్యుడికి ఇద్దరు ఎంపీటీసీల మద్దతు కావాలి.
●గుండాలలో ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీపీ స్థానాన్ని 2019లో ఎస్టీ జనరల్ అభ్యర్థికి కేటాయించగా, ఈసారి ఎస్టీ మహిళకు దక్కింది. జెడ్పీటీసీని జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. ఇక్కడ ఎంపీపీ పదవి పొందాలనుకునే సభ్యుడికి మరో ఇద్దరు ఎం పీటీసీల సహకారం అవసరం. జెడ్పీటీసీ జనరల్ కావడంతో పలువురు నాయకులు ఇటువైపు కన్నేయగా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
●అన్నపురెడ్డిపల్లి గతంలో చండ్రుగొండ మండలంలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలంలో ఆరు ఎంపీటీసీస్థానాలు ఉండగా 2019లో ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఎంపీపీ పదవి కావాలనుకునే అభ్యర్థికి మరో ముగ్గురు సభ్యల మద్దతు అవసరం.
●సుజాతనగర్ మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఇటీవల కొత్తగూడెం కార్పొరేషన్‌లో పలు గ్రామాలు కలవడంతో ఆ సంఖ్య ఐదుకు తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ జెడ్పీటీసీ బీసీ జనరల్‌కు, ఎంపీపీ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. ఎంపీపీ కావాలనుకునే ఎంపీటీసీకి మరో ఇద్దరు సభ్యుల సహకారం అవసరం.
మండలం ఎంపీటీసీ ఎంపీపీ
స్థానాలు రిజర్వేషన్
ఆళ్లపల్లి 5 ఎస్టీ జనరల్
కరకగూడెం 5 ఎస్టీ జనరల్
గుండాల 5 ఎస్టీ మహిళ
సుజాతనగర్ 5 ఎస్టీ జనరల్
అన్నపురెడ్డిపల్లి 6 ఎస్టీ మహిళ