భద్రగిరిలో ‘స్థానిక’ వేడి | - | Sakshi
Sakshi News home page

భద్రగిరిలో ‘స్థానిక’ వేడి

Oct 5 2025 2:26 AM | Updated on Oct 5 2025 2:26 AM

భద్రగిరిలో ‘స్థానిక’ వేడి

భద్రగిరిలో ‘స్థానిక’ వేడి

జెడ్పీటీసీ పీఠంపై కాంగ్రెస్‌,

బీఆర్‌ఎస్‌ గురి

విద్య, వైద్య రంగ ప్రముఖులకు ఎర

పొత్తుల దిశలో సీపీఎం, సీపీఐలు

హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్న పార్టీలు

భద్రాచలం: భద్రాచలం జెడ్పీటీసీ పీఠంపై అఽధికార, ప్రతిపక్షాలు గురిపెట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ తొలిసారి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐలు చర్చల దిశలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రగిరిలో ఎన్నికల వేడి రాజుకుంది.

విద్య, వైద్య రంగ ప్రముఖులతో

సంప్రదింపులు!

భద్రాచలం జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు బీసీ మహిళా అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం, పట్టణంలో ప్రజలతో పరిచయాలు, ప్రముఖు లతో సత్ససంబంధాలు ఉన్న వారితో రాయబారాలు సాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, డివిజన్‌ నాయకుడు రాంప్రసాద్‌ కలిసి ప్రముఖ వైద్యుడు మోహన్‌రావు సతీమణిని రంగంలో దింపేందుకు సదరు వైద్యుడితో సంప్రదింపులు జరిపారు. ఆమె బ్లాక్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు బుడగం శ్రీనివాస్‌కు స్వయానా సోదరి కావడంతో కాంగ్రెస్‌ నాయకులు ఆ ప్రయత్నానికి ఆదిలోనే చెక్‌ పెట్టారు. ఆమెను కాంగ్రెస్‌ తరఫునే బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ బలం కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు భద్రాచలంలోనే క్రాంతి విద్యాలయం అధినేత సోమరౌతు శ్రీనివాసరావు సతీమణితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌నే గెలుస్తుందని, విజయం తప్పక తమదేనంటూ కేటీఆర్‌తో కూడా హామీ ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు పార్టీలు విద్య, వైద్య రంగాల ప్రముఖులపైనే ఆధారపడనున్నాయి. ఈ నెల 8న ఉన్న హైకోర్టు తీర్పు అనంతరమే ఈ అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం ఉంది.

సీపీఎం, సీపీఐ, టీడీపీలు పొత్తుతో సరి?

సీపీఎం, సీపీఐ, టీడీపీ పొత్తులతో బరిలో నిలిచి బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. వార్డుల్లో బలం ఉన్న సీపీఎం ఇందులో ముందుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నాయకులతో ఆ పార్టీ నాయకులు చర్చలు జరిపారు. ఎనిమిది వార్డులు, వైస్‌ ఎంపీపీ, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిని కేటాయించాలని బీఆర్‌ఎస్‌కు ప్రతిపాదించగా, ఐదు వార్డులను ఇచ్చేందుకు వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ ముందు కూడా ఉంచనుంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లకు ఏ పార్టీ అంగీకరించిన వారితో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే కాంగ్రెస్‌తో కలిసే అవకాశమే ఎక్కువగా ఉందని సీపీఐ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇక టీడీపీ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా, ఒంటరిగా, లేదా కాంగ్రెస్‌తో, లౌకిక పార్టీలతో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయి. బీఆర్‌ఎస్‌తో మాత్రం పొత్తు ఉండే అవకాశం లేదని వారు తేల్చిచెబుతున్నారు. సీపీఐ సైతం పొత్తుతోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా అన్ని పార్టీలు భద్రాచలం జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం జెడ్పీటీసీని తొలిసారి కై వసం చేసుకునేందుకు ఆర్థిక, రాజకీయ బలాలను వాడేందుకు సిద్ధమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement