
ఎన్నికల సామగ్రి సరఫరా
చుంచుపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్‌ను ప్రకటించడంతో జిల్లాలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యాలెట్ పెట్టెలను మరోసారి పరిశీలన చేస్తూ అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. ఎన్నికల సామగ్రిని జెడ్పీ కార్యాలయం నుంచి మండలాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. జిల్లాలో ఈనెల 23, 27వ తేదీల్లో రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు జరుగునున్నాయి. జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, మొదటి విడతలో 11మండలాల పరిధిలో 113 ఎంపీటీసీలకు, రెండో విడతలో మరో 11మండ లాల పరిధిలో 120 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతీ మండలానికి 86 రకాల నమూనా ఫారాలు, కవర్లు, పోటీచేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ప్రచార ఖర్చుల పుస్తకాలు, అఫిడవిట్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ కవర్లు, ఎన్నికల పోటీ అభ్యర్థులకు, సిబ్బందికి అవసరమయ్యే ఎన్నికల నియమావళి కరదీపికలతోపాటు 21రకాల పోలింగ్ సామగ్రిని తొలి విడతలో పంపిణీ చేస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో జిల్లాకు ఎన్నికల సామగ్రి రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు 56 రకాల వస్తువులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీటిలో సిరా, కార్డు బోర్డులు, పెన్నులు, రబ్బర్లు, పెన్సిళ్లు, రబ్బర్ బ్యాండ్లు, కొవ్వొత్తులు, తెల్లవస్త్రాలు, బేసిన్లు, తెల్ల కాగితా లు, నామినేషన్ పత్రాలు, గోనెసంచులు, ట్రంకు పెట్టెలు, లక్క, టబ్బులు, అభ్యర్థుల గుర్తుల పత్రాలు, నోటీసు బోర్డులు, సూదులు, టేపులు, అగ్గిపెట్టెలు, బ్లేడ్లు, వైర్లు,దారాలు, అభ్యర్థుల పాసులు వంటివి ఉంటాయి.
జెడ్పీ నుంచి మండలాలకు కరదీపికలు, ఇతర సామగ్రి పంపిణీ