నూతన జీఎం కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నూతన జీఎం కార్యాలయం ప్రారంభం

Oct 4 2025 1:49 AM | Updated on Oct 4 2025 1:49 AM

నూతన జీఎం  కార్యాలయం ప్రారంభం

నూతన జీఎం కార్యాలయం ప్రారంభం

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రూ.2.5 కోట్లతో నిర్మించిన జీఎం నూతన కార్యాలయాన్ని డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు గురువారం ప్రారంభించారు. తొలుత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సంస్థ ఉద్యోగులు, కార్మికులు, గాంధీజీ బాటలో నడవాలని సూచించారు. ఏరియా జీఎం శాలెంరాజు, ఎస్‌వోటూ జీఎం కోటిరెడ్డి, యూనియన్‌ నాయకులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌లో కానరాని

గాంధీ జయంతి వేడుకలు

ఈ నెల 2న సింగరేణి కార్పొరేట్‌ ఏరియాలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించలేదు. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే వేడుకలను సింగరేణి సంస్థ విస్మరించడం సరికాదని కార్మికులు పేర్కొంటున్నారు. గాంధీ జయంతి రోజున వేతనంతో కూడిన సెలవును పొందటమే కాకుండా మరికొందరు అధికారులు ప్లేడేలు చేసి మూడు మస్టర్లు పొందుతున్నారని, కానీ గాంధీజీకి నివాళులర్పించకపోవడం శోచనీయమని పేర్కొంటున్నారు.

మధిర కళాకారులకు బహుమతులు

మధిర: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెనాలిలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ఉత్తమ ప్రదర్శనతో అవార్డులు సాధించారు. గతనెల 27నుంచి ఈ నెల 2వరకు జరిగిన పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ప్రదర్శించిన కస్తూరి తిలకం తృతీయ బహుమతి సాధించింది. అలాగే, డాక్టర్‌ నిభానుపూడి సుబ్బరాజుకు ఉత్తమ దర్శకుడు, చింతామణి పాత్ర ధరించిన విజయరాణికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ సుబ్బరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుకాగా, అక్కడ సాధన చేసే అవకాశం దక్కిందని.. తద్వారా బహుమతులు సాధిస్తున్నామని తెలిపారు. అలాగే, చిలువేరు శాంతయ్య, ఇనపనూరి వసంత్‌, కిషోర్‌ రెడ్డి, నరాల సాంబశివారెడ్డి, ఎర్రగుంట రాజేశ్వరరావు, రామవరపు ప్రసాద్‌ తదితరులు కూడా భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.

నేడు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్‌ ఎంపికలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–15 బాలబాలికల చెస్‌ జట్లను శనివారం ఎంపిక చేయనున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ బాధ్యులు సీహెచ్‌.గోపికృష్ణ, జ్యోత్స్న తెలిపారు. ఆసక్తి ఉన్న వారు క్రీడాకారులు 94401 62749, 83091 34971 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే సమయాన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు.

ఇసుక లారీ సీజ్‌

దమ్మపేట: అనుమతులు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ లారీని దమ్మపేట పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. మండలంలోని మందలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా ఏపీ నుంచి ఇసుకతో వచ్చిన లారీని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

కిరాణా దుకాణంలో చోరీ

ములకలపల్లి: కిరాణా దుకాణంలో చోరీపై గురువారం కేసు నమోదైంది. రాజుపేట గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాజేష్‌ ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి బుధవారం రాత్రి తాళం వేసి ఇంట్లోకి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా షట్టర్‌ తాళాలు పగులగొట్టి, రూ.60 వేలు చోరీ చేసినట్లు గుర్తించాడు. మాస్క్‌ వేసుకున్న యువకుడు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుప్రసాద్‌ తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం

చండ్రుగొండ: మండలంలోని అన్నారంతండాకు చెందిన విద్యార్థి పునరావృత్తం శ్రీధర్‌ (15) అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. శ్రీధర్‌ గుండాలలోని గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వినాయక చవితి పండుగకు ఇంటికి వచ్చాడు. అనంతరం కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న కుమారుడిని తండ్రి హతీరాం మందలించాడు. దీంతో ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు,స్నేహితులను వాకబు చేసిన ఆచూకీ లభించలేదు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement